NTV Telugu Site icon

Hamas New Chief: హమాస్‌ అధినేతగా సిన్వర్‌ స్థానాన్ని భర్తీ చేసేదేవరు..?

Hamas

Hamas

Hamas New Chief: ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన దాడుల్లో హమాస్‌ మిలిటెంట్‌ గ్రూపు చీఫ్ యాహ్యా సిన్వర్‌ మృతి చెందాడు. గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై జరిగిన దాడి ప్రధాన సూత్రధారి సిన్వరేనని భావించిన ఐడీఎఫ్.. అతడ్ని అంతమొందించిందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కత్జ్ నిర్థారించారు. అయితే, అక్టోబర్‌ 16న రఫా నగరంలో మిలిటెంట్ల కదలికల నేపథ్యంలో ఇజ్రాయెల్‌ బలగాలు ఓ భవనంపై దాడులు చేశాయి. దీంతో ఆ భవనం కుప్పకూలింది. సైనికులు ఆ భవనాన్ని పరిశీలించగా అందులో ముగ్గురు హమాస్‌ మిలిటెంట్లు చనిపోయి కనిపించారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకోగా.. ముగ్గురు మృతుల్లో యహ్యా సిన్వర్‌ ఉన్నట్లు కనిపించడంతో ఐడీఎఫ్‌.. డీఎన్‌ఏ పరీక్షలు చేసింది. ఆ తర్వాత చనిపోయింది హమాస్‌ అధినేతే అని తెలియడంతో ఈ విషయాన్ని ఇజ్రాయెల్ మీడియాకు వెల్లడించింది.

Read Also: Sadhguru Jaggi Vasudev: సద్గురుకు ఉపశమనం.. అక్రమ నిర్బంధం కేసులో విచారణను నిలిపివేసిన సుప్రీంకోర్టు

ఇక, హమాస్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ను ముందుండి నడిపించేది ఎవరన్న దానిపై విస్తృతంగా చర్చ కొనసాగుతుంది. రేసులో పలువురు ఉన్నత స్థాయి నేతల పేర్లు కూడా వినబడుతున్నాయి. ఇందులో హమాస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన మహమ్మద్‌ అల్‌ జహర్‌ పేరు ప్రముఖంగా తెర పైకి వచ్చింది. ఆయన హమాస్‌ గ్రూప్‌ను ముందుండి నడిపిస్తాడని న్యూస్ ప్రచారం అవుతుంది. అదే సమయంలో యహ్యా సిన్వర్‌ సోదరుడు మహమ్మద్‌ సిన్వర్‌ పేరు సైతం ప్రచారంలోకి వచ్చింది. అలాగే, హమాస్‌ పొలిటికల్‌ బ్యూరో సీనియర్‌ సభ్యులు మౌసా అబు మార్జౌక్‌, హమాస్‌ మిలిటరీ వింగ్‌ కమాండర్‌ మొహమ్మద్‌ దీఫ్‌, హమాస్‌ పొలిటికల్‌ బ్యూరో ఖలీల్‌ అల్‌ హయ్యా, ఖలేద్‌ మషాల్‌ సహా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.

Show comments