సౌతాఫ్రికా లో బయటపడ్డ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతోంది. సౌతాఫ్రికా లో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 28 దేశాలకు విస్తరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఒమిక్రాన్ గుర్తించిన తర్వాత కూడా… సౌతాఫ్రికా నుంచి.. విమానాలు నడిచాయి. దీంతో ప్రపంచదేశాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ కట్టడిలో భాగంగా పలు దేశాలు సౌతాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.. మరికొన్ని దేశాలు కోవిడ్ కట్టడి చర్యలను ముమ్మరం చేశాయి.
అయితే ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ వేరియంట్ పై అతిగా స్పందించొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ప్రపంచ దేశాలకు సూచించారు. కఠిన ఆంక్షలు అవసరం లేదన్నారు. వీటి వల్ల వైరస్‌ను నియంత్రించలేమన్నారాయన. పైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, పరిస్థితులు మరింత దిగజారుతాయని టెడ్రోస్ హెచ్చరించారు.
