Site icon NTV Telugu

WhatsApp: భారీగా డేటా లీక్.. 50 కోట్ల మంది నంబర్లు అమ్మకానికి!

Whatsapp Data Breach

Whatsapp Data Breach

WhatsApp Data Breach 50 Crore User Mobile Numbers On Sale: ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ నుంచి భారీగా డేటా లీక్ అయ్యింది. పది కాదు, ఇరవై కాదు.. ఏకంగా 48.7 కోట్ల వాట్సాప్ యూజర్ల ఫోన్ నంబర్లు హ్యాక్ అయ్యాయని, వాటి డేటాబేస్‌ను విక్రయిస్తున్నట్టు ఓ హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరమ్‌లో ప్రకటన పెట్టారని సైబర్ న్యూస్‌ నివేదిక వెల్లడించింది. ఈ ప్రకటనని ఓ హ్యాకర్ పెట్టినట్లు సైబర్ న్యూస్ పేర్కొంది. అమెరికా, భారత్, యూకే, ఈజిప్ట్, సౌదీ అరేబియాతో పాటు 84 దేశాలకు చెందిన యూజర్ల ఫోన్ నంబర్లను అమ్మకానికి పెట్టారని ఆ కథనం కుండబద్దలు కొట్టింది.

అత్యధికంగా ఈజిప్టు నుంచి 4.5 కోట్ల మంది వాట్సాప్ యూజర్ల నంబర్లు లీకైనట్టు సైబర్ న్యూస్ కథనం తెలిపింది. ఆ తర్వాత ఇటలీ, అమెరికా, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, టర్కీ, యూకే, రష్యా దేశాల నుంచి వరుసగా 3.5 కోట్లు, 3.2 కోట్లు, 2.9 కోట్లు, 2 కోట్లు, 2 కోట్లు, 1.1కోట్లు, 1 కోటి మంది వాట్సాప్ యూజర్ల డేటా చోరీ అయ్యింది. అంతేకాదు.. ఒక్కో దేశానికి చెందిన యూజర్ల నంబరుకు ఒక్కో ధర కేటాయించినట్టు ఆ నివేదిక పేర్కొంది. అమెరికా డేటా సెట్‌కు అత్యధికంగా 7 వేల డాలర్లు ధర పెట్టగా.. యూకే డేటా ధర 2500 డాలర్లు, జర్మనీ యూజర్ల నంబర్ల ధర 2 వేల డాలర్లుగా ఉన్నట్లు ఆ కథనం వెల్లడించింది. సైబర్‌ నేరగాళ్లు ఈ నంబర్లను కొనుగోలు చేసి, మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆ నివేదిక హెచ్చరించింది. కాబట్టి.. గుర్తుతెలియని నంబర్ల నుంచి కాల్స్‌ గానీ, మెసేజ్‌లు గానీ వస్తే స్పందించొద్దని సూచించింది.

కాగా.. మెటాకు చెందిన సంస్థల్లో ఇలాంటి డేటా లీక్ ఘటనలు చోటు చేసుకోవడం ఇదేం తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా ఓసారి భారీ డేటా లీక్ అయ్యింది. గతేడాదిలో 50 కోట్ల మందికి పైగా ఫేస్‌బుక్‌ యూజర్ల డేటా హ్యాకర్ల చేతికి చిక్కి.. ఆన్‌లైన్‌లో లీకైనట్టు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో మార్క్ జూకర్‌బర్గ్ కొన్ని లీగల్ సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు అతడు ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కావని హామీ ఇచ్చాడు. కానీ, ఏడాది గ్యాప్‌లోనే వాట్సాప్ డేటా లీక్ అవ్వడంతో.. మెటా సంస్థకు సరికొత్త తలనొప్పులు తప్పలేదు.

Exit mobile version