కాబూల్ లో ప్రస్తుతం పరిస్థితులు మరింత ఘోరంగా మారాయి. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నారు. వేగంగా అధికార మార్పిడి జరుగుతున్నది. అధికారంలోకి వచ్చిన తరువాత శాంతిని, అభివృద్దిని తీసుకొస్తామని తాలిబన్లు చెబుతున్నప్పటికీ ఎవరికి నమ్మకం కుదరడం లేదు. ఎందుకంటే, 1994 లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు పాలనలోకి వచ్చిన సమయంలో కూడా ఇదే విధమైన హామీ ఇచ్చారు. కానీ, ఆ వెంటనే అరాచకాలు సృష్టించారు. వారి నాలుగేళ్ల పాలనలో ఆఫ్ఘన్ వాసులు ఘోరంగా దెబ్బతిన్నారు. ఇప్పుడు కూడా అలాంటి పాలన మళ్లీ చూడాల్సి వస్తుందేమో అని భయపడుతున్నారు. 12 ఏళ్లు దాటిన మహిళలు బయటకు రాకూడదు. చదువుకునేందుకు స్కూళ్లకు వెళ్లకూడదు. ఎవరైనా సరే వారి మతాలకు అనుగుణంగా దుస్తులు ధరించాలి తప్పించి మోడ్రన్‌గా ఉండేందుకు వీలులేదు. 2001కి ముందు ఆఫ్ఘన్‌లో అభివృద్ది మాట ఎలా ఉన్నా, దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అనే రీతిగా ప్రజలు జీవించారు. ఏరోజు ఏం జరుగుతుందో అనే భయంతోనే రోజులు గడిపారు. ఒకవైపు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలిగించబోమని హామీలు ఇస్తూనే, ప్రభుత్వానికి సహకరించిన వారి వివరాలను తాలిబన్లు సేకరిస్తున్నారు. తాలిబన్ల ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో ఇప్పటి వరకు స్కూళ్లు, కార్యాలయాలు తెరుచుకోలేదు. దీంతో పాలన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉండిపోయింది.
Read: షాకిస్తున్న తాలిబన్ల ఆదాయం… అంత డబ్బు ఎక్కడినుంచి వచ్చిందంటే…
