NTV Telugu Site icon

Israel: ఇజ్రాయిల్‌కి అండగా ఉంటామన్న ప్రధాని మోడీ.. ప్రపంచ నేతల మద్దతు..

Isreal

Isreal

Israel: పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయిల్ పై భీకరదాడికి తెగబడింది. ఇప్పటికే పదుల సంఖ్యలో ఇజ్రాయిల్ పౌరులను కాల్చి చంపారు. పలువురిని మిలిటెంట్లు బందీలుగా పట్టుకున్నారు. మరోవైపు ఇజ్రాయిల్ సైన్యం గాజాపై ఎదురుదాడికి దిగింది. మిలిటెంట్లు, వారి స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే ప్రపంచ నేతలు ఇజ్రాయిల్ కి మద్దతు నిలుస్తున్నారు. తమను తాము రక్షించుకోవడం ఇజ్రాయిల్ సంపూర్ణ హక్కని ప్రపంచ నాయకులు ఆ దేశానికి మద్దతు తెలుపుతున్నారు.

ప్రధాని నరేంద్రమోడీ ఈ దాడుల్ని ఖండించారు. ‘‘ఇజ్రాయిల్‌పై తీవ్రవాద దాడుల వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యానని, నా ఆలోచనలు, ప్రార్థనలు అమాయక బాధితులు, వారి కుటుంబాలతో ఉన్నాయి. ఈ క్లిష్ట సమయంలో మేము ఇజ్రాయిల్ కి సంఘీభావం ప్రకటిస్తున్నాం. ’’ అని పీఎం మోడీ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.

‘‘ఇజ్రాయిల్ పౌరులపై ఈ ఉదయం హమాస్ ఉగ్రవాదులు జరిపి దాడులతో నేను షాక్‌కి గురయ్యాను. ఇజ్రాయిల్ తనను తారు రక్షించుకునే సంపూర్ణ హక్కు ఉంది. మేము ఇజ్రాయిల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాము.’’ అని యూకే ప్రధాని రిషి సునాక్ అన్నారు.

‘‘ ఇజ్రాయిల్‌పై జరిగిన ఉగ్రదాడుల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాను’’ అని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్కాన్ అన్నారు.

‘‘ ఇజ్రాయిల్ నుంచి ఈ రోజు భయానక వార్త వచ్చింది. గాజా నుంచి రాకెట్ కాల్పులు, హింస మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. జర్మనీ హమాస్ దాడుల్ని ఖండిస్తుంది. ఇజ్రాయిల్ కి అండగా ఉంటుంది’’ అని జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ అన్నారు.

నెదర్లాండ్ ప్రధాని మార్క్ రుట్టే ఈ దాడిని ఖండించారు. తాను నెతన్యాహుతో మాట్లాడనని, ఈ హింసాత్మక దాడి నుంచి రక్షించుకునే హక్కు ఇజ్రాయిల్ కు ఉందని అన్నారు. పాలస్తీనా- ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తత తలెత్తడంపై ఈజిప్టు ఆందోళనను వ్యక్తం చేసింది. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ సూచించారు. సమస్యని నివారించేందుకు ఇజ్రాయిల్, పాలస్తీనా, అరబ్ దేశాలతో రష్యా సంప్రదింపులు జరుపుతోందని రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి మిఖాయిల్ బోగ్దానోవ్ అన్నారు.