NTV Telugu Site icon

Russia: రష్యాలో తిరుగుబాటు.. పుతిన్‌పై ప్రతీకారం తీర్చుకుంటాని వాగ్నర్ గ్రూప్ వార్నింగ్..

Putin

Putin

Russia: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్లు యుద్ధంలో రష్యా తరుపును పోరాడిన వాగ్నర్ కిరాయి సైన్యం ఇప్పుడు అధ్యక్షుడు పుతిన్‌కి ఎదురుతిరుగుతోంది. రష్యాలో తిరుగుబాటును అణిచివేసేందుకు అక్కడి సైన్యం ప్రయత్నిస్తోంది. రష్యా మిలిటరీ నాయకత్వాన్ని కూల్చేస్తామని వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ వార్నింగ్ ఇచ్చాడు. తన బలగాలను లక్ష్యంగా చేసుకుంటూ, రష్యా సైన్యం దాడులకు తెగబడుతోందని, ఈ దాడుల్లో వందలాది మంది తమవారు చనిపోతున్నారని ఆయన ఆరోపించారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని.. సాయుధ తిరుగుబాటుకు పిలుపునిచ్చాడు.

Read Also: Nora Fatehi : సరికొత్త మ్యూజిక్ వీడియోతో అలరించిన నోరా ఫతేహి..

ఈ నేపథ్యంలో రష్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ సౌకర్యాలు మరియు కీలక ప్రదేశాల వెలుపల భద్రతను పెంచింది. వాగ్నర్‌ను “నాశనం” చేసే ఆపరేషన్‌ను రక్షణ మంత్రి సెర్గీ షోయిగు పర్యవేక్షిస్తున్నారని ప్రిగోజిన్ ఆరోపించారు. తాము రష్యాకు చెందిన ఒక సైనిక హెలికాప్టన్ ను కూల్చేసినట్లు ఆయన తెలిపారు. అయితే ప్రిగోజిన్ వాదనలను రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. సాయుధ తిరుగుబాటుపై క్రిమినల్ విచారణ ప్రారంభించినట్లు రష్యా ప్రభుత్వం తెలిపింది.

శనివారం తెల్లవారుజామున మరో ఆడియో సందేశంలో ప్రిగోజిన్ మాట్లాడుతూ.. తాను, తన యోధులు సరిహద్దును దాటి రష్యాలోకి తిరిగి వచ్చారని, దక్షిణ నగరమైన రోస్టోవ్ ఆన్ డాన్‌లోకి ప్రవేశిస్తున్నామని చెప్పారు. మాలో 25000 మంది ఉన్నారని.. దేశంలో ఎందుకు అన్యాయం జరుగుతోంది గుర్తించి తమతో చేరాలని రష్యా ప్రజలకు పిలుపునిచ్చారు. ఇది సైనిక తిరుగుబాటు కాదని, న్యాయం కోసం పోరాడుతున్నామని వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ చెప్పారు. రష్యా సైనిక నాయత్వాన్ని కూల్చేస్తామని ప్రకటించి వాగ్నర్ గ్రూప్ సంచలన ప్రకటన చేసింది. తాము 25000 మంది ఉన్నామని చావడానికి సిద్ధంగా ఉన్నామని, రష్యా ప్రజలకోసం ప్రాణాలు ఆర్పిస్తామని చెప్పారు.