Voyager-2: 1977లో భూమి నుంచి ప్రయోగించి వాయేజర్ -2 అంతరిక్ష నౌక ఇప్పటికీ విశ్వ రహస్యాలను భూమికి పంపిస్తూనే ఉంది. మన సౌర వ్యవస్థను దాటేసి సూర్యుడి ప్రభావం అస్సలు లేని ఇంటర్ స్టెల్లార్ స్పేస్ లో ప్రయాణిస్తోంది. 1977లో విశ్వ రహస్యాలను తెలుసుకునేందుకు వాయేజర్ 1, వాయేజర్-2 అంతరిక్ష నౌకల్ని నాసా ప్రయోగించింది. భూమికి సుదూరంగా ఉన్న గురుడు, శని, యూరేనస్, నెప్ట్యూన్ వంటి గ్రహాల అధ్భుత ఛాయాచిత్రాలను భూమికి పంపించాయి. తాజాగా వాయేజర్ 2 మిషన్ 2026 వరకు పనిచేసేందుకు సిద్ధంగా ఉందని ఇంజనీర్లు తెలిపారు.
ప్రస్తుతం గంటకు 55,345 కిలోమీటర్లు అంటే సుమారుగా సెకన్ కు 16 కిలోమీటర్ల వేగంతో విశ్వంలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం భూమి నుంచి 2000 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాయేజర్-2కు భూమి నుంచి సిగ్నల్స్ అందుకోవాలంటే దాదాపుగా 18 గంటల సమయం పడుతోంది. దానిలో ఉన్న కొన్ని సైన్స్ పరికరాలు మరికొన్ని ఏళ్ల పాటు ఆన్ లో ఉండనున్నాయి. ఆన్‌బోర్డ్ సేఫ్టీ మెకానిజంలో భాగంగా ఉన్న బ్యాకప్ పవర్ ను ఉపయోగించుకునేలా భూమిపై ఉన్న ఇంజనీర్లు వాయేజర్-2కి సిగ్నల్స్ పంపారు.
సూర్యుడి అవతల ఉన్న విశ్వం సమాచారం చాలా విలువైంది కావడంతో వీలైనన్నీ ఎక్కువ సైన్స్ పరికాలు పరిచేసేలా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. వాయేజర్-2 రేడియో ఐసోటోప్ థర్మోఎలెక్ట్రిక్ జనరేటర్ (RTGs)ను ఉపయోగిస్తుంది. ఇది ఫ్లూటోనియం నుంచి వేడిని విద్యుత్ గా మారుస్తోంది. ప్రస్తుతం అంతరిక్ష నౌక ఇంటర్స్టెల్లార్ స్పేస్ నుండి కీలక డేటాను అందించడం కొనసాగిస్తున్నందున శక్తి నెమ్మదిగా తగ్గుతోంది. నాసాలోని బృందం పవర్‌ను ఆదా చేసేందుకు ఇప్పటికే హీటర్లు మరియు ఇతర సిస్టమ్‌లను ఆఫ్ చేసింది. మిగిలి ఉన్న ఎనర్జీతో మరింత సమచారం పొందాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.