Site icon NTV Telugu

Vladimir Putin: బెంజ్ కార్ నడిపి.. ఆ వార్తలకు చెక్ పెట్టిన పుతిన్

Vladimir Putin Crimea Bridg

Vladimir Putin Crimea Bridg

Vladimir Putin Visited Crimean Bridge Which Exploded By Ukraine In October: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండ్రోజుల క్రితం జారి పడ్డారని ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లు దిగుతున్న సమయంలో ఆయన పడిపోయారని, ఈ ప్రమాదంలో తుంటి ఎముక విరిగిందని న్యూయార్క్‌ పోస్ట్‌ తన కథనంలో పేర్కొంది. తుంటి ఎముక విరగడంతో.. పుతిన్ ప్రమేయడం లేకుండానే మలమూత్ర విసర్జన జరుగుతోందని, క్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని కూడా ఆ కథనంలో రాసుకొచ్చింది. అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని రష్యా మీడియా తేల్చి చెప్పింది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, ఎక్కడా జారి పడలేదని పేర్కొంది. అంతేకాదు.. ఇటీవల బాంబు దాడిలో దెబ్బతిన్న క్రిమియా వంతెనను పుతిన్ సందర్శించిన దృశ్యాలను సైతం రష్యా మీడియా ప్రసారం చేసింది.

ఈ వీడియోలో పుతిన్‌ స్వయంగా మెర్సిడెస్‌ బెంజ్‌ కారును డ్రైవ్‌ చేయడాన్ని గమనించవచ్చు. ఆ సమయంలో పుతిన్ పక్కన డిప్యూటీ ప్రధాని మారాట్‌ ఖుసులిన్‌ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా.. వాళ్లిద్దరు వంతెనపై దాడి జరిగిన వ్యవహారంపై చర్చించుకున్నారు. ఖుసులిన్‌తో పుతిన్ మాట్లాడుతూ.. ‘‘వంతెనకు ఎడమ వైపు దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో వంతెన తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ.. ఇది పని చేసే స్థితిలోనే ఉందని నేను భావిస్తున్నాను. అయినప్పటికీ.. ఈ వంతెనకు మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉంది. దెబ్బతిన్న చోట మరమ్మత్తులు చేసి.. ఈ వంతెనను మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావాలి’’ అని అన్నారు. బెంజ్ కార్‌ని డ్రైవ్ చేయడమే కాకుండా, పుతిన్ చాలా హుషారుగా కనిపించడాన్ని చూస్తుంటే.. ఆయన జారిపడినట్టు న్యూయార్క్ పోసిన రాసిన కథనం అబద్ధమని అర్థం చేసుకోవచ్చు. రష్యా మీడియా ఈ దృశ్యాల్ని ప్రసారం చేసి, న్యూయార్క్ పోస్ట్‌కి గట్టి కౌంటరే ఇచ్చినట్లయ్యింది.

పుతిన్ ఆరోగ్యంపై ఇలాంటి వార్తలు రావడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఆయన చేతులు పర్పుల్ రంగులోకి మారిపోయాయని, తీవ్ర అనారోగ్యం వల్లే ఇలా జరిగిందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ కింద జారి పడ్డారని వార్తలు గుప్పుమన్న తరుణంలో.. ఆయన బెంజ్ కార్ నడిపిన దృశ్యాలతో రష్యా మీడియా కౌంటర్ ఇచ్చింది. కాగా.. క్రిమియా వంతెనను వ్లాదిమిర్ పుతిన్ 2018లో ప్రారంభించారు. 19 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనపై ప్రారంభం సమయంలో కూడా పుతిన్ ట్రక్కుపై స్వయంగా డ్రైవింగ్‌ చేస్తూ ప్రయాణించారు.

Exit mobile version