Site icon NTV Telugu

Vladimir Putin: పుతిన్‌పై హత్యాయత్నం.. కానీ!

Attack On Putin

Attack On Putin

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భద్రతా వలయం ఉంది. అలాంటి పుతిన్‌పై హత్యాయత్నం జరిగినట్టు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ చీఫ్ కిరిలో బుదనోవ్ ఉక్రెయిన్ మీడియాతో తెలిపారు. నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రం మధ్య ఉన్న కాకసస్ ప్రాంతంలో పర్యటనకు వెళ్ళినప్పుడు.. అక్కడి ప్రతినిధులు పుతిన్‌పై దాడి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ దాడి నుంచి పుతిన్ తప్పించుకున్నారని అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైన తొలినాళ్లలో ఈ దాడి జరిగినట్లు ఆయన వెల్లడించారు. పుతిన్‌పై దాడి జరిగిన విషయాన్ని రష్యాలో వీలైనంత రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించారన్నారు.

అంతేకాదు.. పుతిన్ అనేక జబ్బులతో బాధపడుతున్నారని, వాటిలో క్యాన్సర్ కూడా ఉందని బుదనోవ్ తెలిపారు. అతను ఇన్ని జబ్బులతో బాధపడుతున్నా, త్వరగా చనిపోతాడని మనం ఆశించడానికి లేదని, అతనికింకా ఈ భూమ్మీద నూకలు మిగిలే ఉన్నాయన్నారు. తాను మూడు రోజుల్లోనే ఉక్రెయిన్‌ని కబళించి వేయగలనని పుతిన్ అనుకున్నాడని, కీవ్‌లోని ఉక్రెయిన్ అధికార భవనంపై రష్యా జెండా ఎగురుతుందని భావించారని.. కానీ ఇవేవీ నెరవేరకపోయేసరికి ఆయన మానసికంగా కుంగిపోయాడని బుదనోవ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యంత భారీ సైనిక బలం కలిగిన దేశాల్లో రష్యా ఒకటి. అలాంటి రష్యా.. మూడు నెలలు గడుస్తున్నా ఇంకా ఉక్రెయిన్‌ని చేజిక్కించుకోలేకపోయిన నేపథ్యంలో పుతిన్‌కి మాటలు కరువయ్యాయన్నారు.

పుతిన్‌కు ఆగస్టు నుంచి వ్యతిరేక పవనాలు వీయవచ్చని.. ఈ ఏడాది చివరి నాటికి క్రెమ్లిన్‌లో తిరుగుబాటు జరిగి, ఆయన్ను పదవి నుంచి తప్పించవచ్చని బుదనోవ్ అంచనా వేశారు. ఆల్రెడీ ఈ ప్రక్రియ మొదలైందని బాంబ్ పేల్చారు. 20, 21వ శతాబ్దంలో నియంతలు దారుణంగా చచ్చినవాళ్ళే ఉన్నారని.. ఉదాహరణకు సద్దామ్ హుస్సేన్, మాజీ యుగోస్లావియా నియంత, లిబియా నియంత ఘోరంగా మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు. పుతిన్‌కు కూడా అలాంటి పరిస్థితే వస్తుందని బుదనోవ్ జోస్యం పలికారు. కాగా.. గతంలో తన మీద ఐదు సార్లు హత్యాయత్నం జరిగినట్టు 2017లో స్వయంగా పుతినే వెల్లడించారు.

Exit mobile version