అమెరికా, పశ్చిమ దేశాల్లో వలసలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురవుతోంది. ఆయా దేశాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో ఇతర దేశాల నుంచి వలసలు బాగా పెరిగిపోయాయి. గతంలో వారికి స్వాగతించిన వారే… ప్రస్తుతం వ్యతిరేకత చూపుతున్నారు. చాలా దేశాలలో “స్థానికులకే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దక్కాలి” అనే నినాదంతో నిరసనలు, ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే… ఉన్నత విద్య, ఉజ్వల భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయుల ఆశలు ఆవిరవుతున్నాయి. అమెరికా, పశ్చిమ దేశాల్లో వలసలపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరుగుతోంది. ప్రతీ ఏడాది లక్షలాది మంది ఆయా దేశాలకు వలస పోతున్నారు. గతంలో అమెరికాలో మాత్రమే.. ఉన్న వలసల వ్యతిరేకత.. ప్రస్తుతం కెనడా, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలకు సైతం వ్యాపించింది. దీంతో వలస వెళ్లిన వారి భద్రత, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారాయి. స్థానికులకే ఉద్యోగాలు దక్కాలనే నినాదంతో పలు దేశాల్లో నిరసనలు వెల్లువెత్తడం ఆందోళన కలిగిస్తోంది.
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం అనుసరించిన ‘అమెరికా ఫస్ట్’ విధానంతో వలసదారులపై వ్యతిరేకతకు బీజం పడింది. అమెరికాలో ఇదే విషయంపై ప్రచారం చేసిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. వలస వచ్చిన వారిని ఏరిపారేస్తామంటూ చెప్పిన ట్రంప్ అన్నంత పనీ చేశారు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ నినాదంతో ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అమెరికన్లకే పెద్దపీట వేస్తూ వలసదారులపై కఠినమైన ఆంక్షలు విధించడం మొదలుపెట్టారు. ఇదే ధోరణి ఇప్పుడు ఇతర దేశాల్లోనూ కనిపిస్తోంది. ఆస్ట్రేలియాలో ‘మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా’ పేరుతో వేలాది మంది రోడ్లపైకి వచ్చి వలసలను ఆపాలని డిమాండ్ చేశారు. కెనడాలోనూ భారతీయులు సహా విదేశీయులు దేశం విడిచి వెళ్లాలంటూ పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి.
ఇక, ఐరోపాలో ఈ సెగ మరింత తీవ్రంగా ఉంది. లండన్ వీధుల్లో ఏకంగా లక్షన్నర మంది వలసలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలో పాల్గొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జర్మనీ, డబ్లిన్, వార్సా వంటి నగరాల్లోనూ ఇదే తరహా ఆందోళనలు జరిగాయి. ఈ పరిణామాలన్నీ విదేశాల్లో విద్య, ఉద్యోగాల కోసం వెళ్లే భారతీయులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఆర్థిక భద్రతే కాకుండా, సామాజిక భద్రత కూడా కరవయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ వలస వ్యతిరేక నిరసనలు ముదిరితే, భారతీయులే లక్ష్యంగా జాతి విద్వేష దాడులు జరిగే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
