NTV Telugu Site icon

Malaria: అమెరికాను భయపెడుతున్న మలేరియా.. 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా కేసులు..

Malaria

Malaria

Malaria: దోమల ద్వారా సంక్రమించే మలేరియా వ్యాధి అమెరికాను గడగడలాడిస్తోంది. దాదాపుగా 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా యూఎస్ఏలో మలేరియా కేసులు నమోదు అవుతున్నాయి. రెండు నెలల్లో 5 కేసులు నమోదయ్యాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(CDS) ప్రకారం, నాలుగు కేసులు ఫ్లోరిడాలో కనుగొనబడ్డాయి. ఐదో కేసు టెక్సాస్ లో కొనుగొనబడింది. రోగులు విదేశాలకు వెళ్లిన దాఖలాలు లేకపోవడంతో ఈ వ్యాధి స్థానికంగానే సంక్రమించిందని వైద్యాధికారులు తెలిపారు.

గత 20 ఏళ్లో అమెరికాలో స్థానికంగా మలేరియా సంక్రమణ లేదు. చివరిసారిగా 2003లో ఫ్లోరిడాలోని పామ్ బీచ్ లో 8 మలేరియా కేసుల్ని నమోదయ్యాయి. దేశంలో చాలా ప్రాంతాల్లో కనిపించే ఆడ అనాఫిలిస్ దోమ మలేరియా వ్యాధిని కలుగజేస్తుంది. అయినా కూడా యూఎస్ లో ఈ వ్యాధి బారిన పడటం చాలా అరుదని సీడీఎస్ తెలిపింది. అమెరికాలో నమోదయ్యే కేసుల్లో చాలా వరకు రోగులు ఇతర ప్రాంతాలకు ప్రయాణించిన సమయంలో ఈ వ్యాధి బారిన పడ్డారు. అయితే ఈ సారి మాత్రం నమోదైన 5 కేసుల్లో ఎలాంటి విదేశీ ప్రయాణ చరిత్ర లేదని అధికారులు గుర్తించారు. స్థానికంగానే మలేరియా వ్యాధి సంక్రమించినట్లు తేల్చారు.

Read Also: Taliban Rule: తాలిబన్‌ పాలనలో పౌరుల మరణాలు పెరిగాయి.. ఐరాస ఆందోళన

మలేరియా నమోదైన నేపథ్యంలో టెక్సాస్, ఫ్లోరిడాల్లో వైద్యాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు నిల్వ ఉన్న నీటిని తొలగించాలని, డోర్లకు,కిటీకీలకు మెష్ ఉండా..? లేదా..? అని నిర్థారించుకోవాలని కోరారు. అధికారులు దోమల్ని నిరోధించేందుకు చర్యలు చేపట్టారు. మలేరియా అని అనుమానం ఉన్న రోగులకు 24 గంటల్లో వేగవంతమైన రోగనిర్థారణ చేయడంతో పాటు చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపథ్యంలో మలేరియా సర్వసాధారణంగా మారుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

మలేరియా అనేది ఆడ అనాఫిలిస్ దోమ కారణంగా వస్తుంది. మలేరియాలో జ్వరం, చలి, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట, వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కలిగి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మూత్రపిండాల వైఫల్యం, మూర్ఛ, కోమాతో ప్రాణాంతకంగా మారొచ్చు. చికిత్సలో క్లోరోక్విన్ లేదా అటోవాకోన్ మరియు ప్రోగువానిల్ వంటి యాంటీమలేరియల్ మందులు తీసుకోవడం ద్వారా రోగి కోలుకోవచ్చు. 2021 లో, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా 247 మిలియన్ల మలేరియా కేసులు ఉన్నట్లు అంచనా వేసింది.

Show comments