Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఉగ్ర దేశ జాబితా నుంచి ఆ దేశం తొలగింపు

  • ట్రంప్ సంచలన నిర్ణయం
  • ఉగ్ర దేశ జాబితా నుంచి సిరియా తొలగింపు
  • ఇకపై సిరియాలోకి పెట్టుబడులు వచ్చే అవకాశం
Trump1

Trump1

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెర్రరిజం స్పాన్సర్ దేశాల జాబితా నుంచి సిరియాను తొలగించారు. 47 ఏళ్ల తర్వాత సిరియాకు భారీ ఊరట లభించింది. 1979 నుంచి దాదాపు 47 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ హోదాకు తెరపడింది. సోమవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూలైలో ఈ హోదాను రద్దు చేయాలనే ఉద్దేశాన్ని ప్రకటించిన తర్వాత.. 45 రోజుల పాటు కాంగ్రెస్ సమీక్ష నిర్వహించింది. ఆ ప్రక్రియ పూర్తయిన అనంతరం సిరియాను ఉగ్ర జాబితా నుంచి తొలగించారు.

ఈ నిర్ణయం సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ డిసెంబర్ 2024లో అధికారం కోల్పోయిన తర్వాత చోటుచేసుకున్న కీలక పరిణామంగా భావిస్తున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న అహ్మద్ అల్-షారా ప్రభుత్వం అంతర్జాతీయ సంబంధాలను పునరుద్ధరించడంతో పాటు.. దేశ పునర్నిర్మాణానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది.

అమెరికా తాజా నిర్ణయాన్ని సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షారా స్వాగతించారు. ఇది తమ దేశానికి కష్టతరమైన అధ్యాయానికి ముగింపు అని పేర్కొన్నారు. “ఈ రోజు సిరియా ఒక చీకటి మచ్చను తొలగించుకుంది. బాధాకరమైన గతంలోని ఒక అధ్యాయాన్ని ముగించుకుని.. అభివృద్ధి, పునర్నిర్మాణం, దేశ నిర్మాణం వైపు అడుగులు వేస్తోంది” అని ఆయన మంగళవారం ప్రసంగంలో తెలిపారు.

అమెరికా ‘స్టేట్ స్పాన్సర్స్ ఆఫ్ టెర్రరిజం’ జాబితాలో ఉండటం వల్ల ఆయా దేశాలపై తీవ్ర ఆర్థిక, చట్టపరమైన ఆంక్షలు ఉంటాయి. విదేశీ సాయం, రక్షణ రంగ ఎగుమతులు, కొన్ని ఆర్థిక లావాదేవీలు, ద్వంద్వ వినియోగ వస్తువుల బదిలీ వంటి అంశాలపై ఆంక్షలు విధిస్తారు. అంతేకాకుండా.. అదనపు చట్టపరమైన, నియంత్రణపరమైన ప్రమాదాలు ఉంటాయనే కారణంతో అంతర్జాతీయ బ్యాంకులు, కంపెనీలు ఆయా దేశాలతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు వెనుకడుగు వేసే అవకాశం ఉంటుంది. 1979లో అప్పటి అధ్యక్షుడు హఫీజ్ అల్-అసద్ ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న సాయుధ గ్రూపులకు మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ అమెరికా సిరియాను ఈ జాబితాలో చేర్చింది. ఆయన కుమారుడు బషర్ అల్-అసద్ పాలనలోనూ ఈ హోదా కొనసాగింది.

తాజా నిర్ణయంతో సిరియాకు అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో తిరిగి ప్రవేశించేందుకు.. పునర్నిర్మాణం కోసం విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కొన్ని అడ్డంకులు తొలగనున్నాయి. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ మాట్లాడుతూ.. ఈ నిర్ణయం సిరియాలో రాజకీయ, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహించే అదనపు పెట్టుబడులకు దోహదపడుతుందని అన్నారు.

అసలు అమెరికా ఎందుకు తొలగించింది?

బషర్ అల్-అసద్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత సిరియాతో అమెరికా సంబంధాల్లో వచ్చిన విస్తృత మార్పులో భాగంగానే తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూలైలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ.. సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షారా నుంచి “భవిష్యత్తులో అంతర్జాతీయ ఉగ్రవాద చర్యలకు సిరియా మద్దతు ఇవ్వబోదు” అనే అధికారిక హామీలు తమకు అందాయని తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ నెట్‌వర్క్‌లపై సిరియా ప్రభుత్వం, అమెరికా కలిసి పనిచేస్తున్న అంశాన్ని కూడా వాషింగ్టన్ ప్రస్తావించింది. అయితే అల్-షారా గతం కూడా ఈ పరిణామంలో కీలక అంశమే. ఆయన గతంలో సిరియాలో అల్‌ఖైదా అనుబంధ సంస్థ అయిన అల్-నుస్రా ఫ్రంట్‌కు నాయకత్వం వహించారు. 2016లో ఆ సంస్థతో సంబంధాలను తెంచుకున్నట్లు ప్రకటించారు.

సిరియాను టెర్రరిజం స్పాన్సర్ దేశాల జాబితా నుంచి తొలగించడంతో పాటు.. అల్-నుస్రా ఫ్రంట్, హయత్ తహ్రీర్ అల్-షామ్ పై ఉన్న గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హోదాను కూడా అమెరికా రద్దు చేసింది. ఇప్పటికే సిరియాపై అమల్లో ఉన్న విస్తృత ఆంక్షల్లో చాలా వరకు అమెరికా తొలగించింది. దీంతో విదేశీ పెట్టుబడులకు ఉన్న మరో ప్రధాన అడ్డంకి కూడా తొలగింది. తాజా నిర్ణయంతో అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలు డమాస్కస్‌తో వ్యాపారం చేయడంలో ఎదుర్కొంటున్న మరికొన్ని చట్టపరమైన పరిమితులు తొలగనున్నాయి.

ఇంకా ఆ మూడు దేశాలే..

సిరియాను జాబితా నుంచి తొలగించడంతో అమెరికా ‘స్టేట్ స్పాన్సర్స్ ఆఫ్ టెర్రరిజం’ జాబితాలో ఇప్పుడు కేవలం ఇరాన్, క్యూబా, ఉత్తర కొరియా మాత్రమే మిగిలాయి.

ఇరాన్: 1984 నుంచి ఈ జాబితాలో ఉంది. ఇరాన్ ప్రభుత్వం, ఆర్థిక సంస్థలు, సైన్యం, చమురు రంగంపై విస్తృత అమెరికా ఆంక్షలు కొనసాగుతున్నాయి.

క్యూబా: 1982లో తొలిసారిగా ఈ జాబితాలో చేరింది. అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో 2015లో తొలగించారు. అయితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2021 జనవరిలో మళ్లీ ఈ హోదాను పునరుద్ధరించారు.

ఉత్తర కొరియా: 1988లో కొరియన్ ఎయిర్ ఫ్లైట్ 858 బాంబు పేలుడులో ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ జాబితాలో చేర్చారు. ఆ ఘటనలో విమానంలోని మొత్తం 115 మంది మరణించారు. 2008లో అమెరికా ఉత్తర కొరియాను జాబితా నుంచి తొలగించగా.. 2017లో మళ్లీ చేర్చింది.

అమెరికా ‘స్టేట్ స్పాన్సర్స్ ఆఫ్ టెర్రరిజం’ జాబితా ఇతర ఆంక్షల కార్యక్రమాలకు భిన్నమైనది. ఉదాహరణకు రష్యా, వెనిజులాపై అమెరికా విస్తృత ఆంక్షలు విధించినప్పటికీ.. వాటిని అధికారికంగా ‘స్టేట్ స్పాన్సర్స్ ఆఫ్ టెర్రరిజం’ దేశాలుగా గుర్తించలేదు. సిరియా విషయానికొస్తే.. దాదాపు ఐదు దశాబ్దాల పాటు కొనసాగిన ఈ హోదా ఇప్పుడు ముగిసింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలోకి తిరిగి ప్రవేశించేందుకు, వాణిజ్యం, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న డమాస్కస్‌కు అమెరికా తాజా నిర్ణయం కీలక ఊరటగా మారనుంది.