Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా రేపు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. దీని కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. రాజధాని వాషింగ్టన్‌లోని యూఎస్ క్యాపిటల్‌లో జరగబోతున్నాయి. చల్లని వాతావరణం కారణంగా ఇండోర్ వేదికలో కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి పలు దేశాధినేతలతో పాటు కీలకమైన రాజకీయ నాయకులు, టెక్ దిగ్గజాలు హాజరుకాబోతున్నారు.
ఇదిలా ఉంటే, ట్రంప్ పదవీ బాధ్యతలు తీసుకున్న వెంటనే సంచలన నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. తాను అధికారంలోకి వచ్చిన వెంటను అక్రమ వలసదారుల్ని బహిష్కరిస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఇదే కాకుండా ‘‘బర్త్ రైట్ పౌరసత్వం’’ రద్దు చేస్తానని, మెక్సికో-కెనడా దేశాల దిగుమతులపై సుంకాలు విధిస్తానని చెప్పారు. అయితే, వీటిన్నింటిపై తొలి రోజే చర్యలు మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
సోమవారం పదవీ బాధ్యతతలు స్వీకరించిన తర్వాత తాను ఎన్ని ఆర్డర్లపై సంతకం చేస్తాననే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అయితే, సంఖ్య మాత్రం ‘‘రికార్డ్ సెట్’’ చేస్తుందని ట్రంప్ ఎన్‌బీసీ న్యూస్‌తో అన్నారు. ఇది 100ని దాటుతుందా..? అని ప్రశ్నించిన సమయంలో కనీసం ఆ సంఖ్య ఉంటుందని స్పష్టం చేశారు. దీనిని బట్టి చూస్తే ట్రంప్ తన తొలిరోజే ఏకంగా 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అవుట్‌గోయింగ్ ప్రెసిడెంట్ జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో తెచ్చిన విధానాలను రద్దు చేస్తూ ట్రంప్ ఉత్తర్వులపై సంతకం చేస్తారని అంతా భావిస్తున్నారు. పత్రాలు లేని వలసదారుల బహిష్కరణ ప్రారంభమవుతుందని ట్రంప్ చెప్పారు.