తల్లి, బిడ్డల బంధం ఎంత గొప్పదో మాటల్లో చెప్పలేనిది. పురుడుపోసుకుని బయటకు వచ్చిన శిశువుకు వెంటనే మురిపాలు తాగిస్తారు. ఈ పాలు బిడ్డకు ఎంతో ప్రయోజనకరం. శిశువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే శిశువు బయటకు రాగానే వైద్యులు.. మురిపాలు పట్టించమని చెబుతుంటారు. అయితే కొందరి తల్లులకు ఈ భాగ్యం దక్కదు. చాలా మంది తల్లులకు పాలు పడవు. దీంతో పిల్లలు అనారోగ్యం పాలవుతుంటారు. అయితే టెక్సాస్‌కు చెందిన ఓ మాతృమూర్తి తన పాలును దానం చేసింది. పాలు లభించక ఇబ్బంది పడే బిడ్డల కోసం దాదాపు 2,645 లీటర్ల పాలు విరాళం ఇచ్చి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది.
టెక్సాస్‌కు చెందిన 36 ఏళ్ల అలీస్ ఓగ్లెట్రీ.. బలహీనమైన శిశువులకు తన పాలు ద్వారా పోషణ అందించాలని నిర్ణయం తీసుకుంది. అలా 2010 నుంచి నార్త్ టెక్సాస్‌లోని మదర్స్ మిల్క్ బ్యాంక్‌కు 2,645 లీటర్లకు పైగా తల్లిపాలను విరాళంగా ఇచ్చింది. దీంతో ఆమె తాజాగా ప్రపంచ గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. 2010 నుంచి ఇప్పటి వరకు 2,645 లీటర్ల పాలను దానంగా ఇచ్చింది. దీంతో అనేకమంది పిల్లలు అనారోగ్యం నుంచి బయటపడ్డారు. ఇదిలా ఉంటే గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకోవడంపై అలీస్ ఓగ్లెట్రీ ఆనందం వ్యక్తం చేసింది.
350,000 మంది శిశువులకు సహాయం చేయడానికి పెద్ద హృదయం ఉన్న తల్లిగా అలీస్ రికార్డు సొంతం చేసుకుంది. జూలై 2023 నాటికి 2,645.58 లీటర్లతో అతి పెద్ద తల్లిపాలు విరాళంగా అందించి రికార్డును క్రియేట్ చేసింది. 2014లో 1,569.79 లీటర్ల దానంపై ఉన్న రికార్డును అలీస్ ఓగ్లెట్రీ(36) బద్దలుకొట్టింది. డబ్బు సంపాదన కోసం తాను ఇలా చేయలేదని.. అక్కరలో ఉన్న వారికి సాయం చేసేందుకు తనకు పెద్ద హృదయం ఉందని అలీస్ స్పష్టం చేసింది. అలీస్ 2010లో మొదటి కుమారుడైన కైల్‌కి జన్మనిచ్చినప్పుడు.. పాలు దానం చేయడం ప్రారంభించింది. ఆస్పత్రిలో ఉన్నప్పుడు నర్సు పాలు దానం చేస్తావని అడిగింది. అప్పటి వరకు ఆ విషయం తెలియదు అని చెప్పింది. అలాగే కుమార్తె కేజ్ పుట్టిన తర్వాత కూడా పాలు దానం చేస్తూనే ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రతి మూడు, నాలుగు గంటలకు పాలు డబ్బాల్లో నింపినట్లు తెలిపింది. అనేక మంది శిశువులకు పాలు దానం చేయడం సంతృప్తినిచ్చిందని అలీస్ వెల్లడించింది.