US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన పలువురు అభ్యర్థులు కీలక స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ట్రంప్ చివరి రెండేళ్లు అమెరికా చట్టసభల్లో ఎవరికి ఆధిపత్యం ఉంటుందో ఈ ఎన్నికలు నిర్ణయించబోతున్నాయి. ఎర్లీ ట్రెండ్స్‌లో ట్రంప్ రిపబ్లిక్ పార్టీకి చేదు ఫలితాలు వస్తున్నట్లు తెలుస్తోంది. డెమోక్రాట్లు చాలా చోట్ల ముందంజలో ఉన్నారు. ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, 100 మంది సభ్యులున్న సెనేట్‌లో 37 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు 36 రాష్ట్రాల్లో గవర్నర్ పదవుల కోసం కూడా పోలింగ్ నిర్వహించారు.
అయితే, ఈ ఎన్నికల్లో భారత సంతతి నేతలు కూడా సత్తా చాటుతున్నారు. రో ఖన్నా, అమీ బెరా, ప్రమీలా జయపాల్, సుహాస్ సుబ్రమణ్యం వంటి ప్రస్తుత కాంగ్రెస్ సభ్యులు మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. పియా దండియా, అమిష్ షా తొలిసారి ప్రతినిధుల సభలో అడుగుపెట్టేందుకు పోటీ పడుతున్నారు. ఇక రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామి ఒహియో గవర్నర్ పదవి కోసం పోటీ చేస్తున్నారు.
వివేక్ రామస్వామి:
కేరళకు మూలాలు ఉన్న రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి ఓహియో గవర్నర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మే నెలలో జరిగిన రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించారు. తాజా లెక్కింపుల్లో డెమోక్రటిక్ అభ్యర్తీ అమీ ఆక్టన్ కన్నా రామస్వామి సుమారు 2 లక్షల ఓట్ల వెనుకంజలో ఉన్నారు.
సుహాస్ సుబ్రమణ్యం..
భారతీయ మూలాలు ఉన్న సుహాస్ సుబ్రమణ్యం వర్జీనియాలోని 10వ కాంగ్రెస్ నియోజకవర్గం నునంచి ప్రతినిధుల సభకు తిరిగి ఎన్నికయ్యారు. 40 ఏళ్ల సుబ్రమణ్యం 61 శాతానికి పైగా ఓట్లు సాధించారు. ఆయన ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి డేవ్ బెక్విత్కు 36 శాతం ఓట్లు వచ్చాయి. సుబ్రమణ్యం న్యూఓర్లీన్స్ లోని టులేన్ యూనివర్సిటీలో చదువుకున్నారు. నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వంలో వైట్‌హౌజ్ టెక్నాలజీ పాలసీ సలహాదారుగా పనిచేశారు.
రో ఖన్నా వర్సెస్ రితేష్ టాండన్..
కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి డెమోక్రటిక్ పార్టీ నుంచి రో ఖన్నా మరోసారి ఎన్నికల పోటీలో నిలిచారు. ఆయనకు ప్రత్యర్థిగా మరో భారతీయ మూలాలు ఉన్న వ్యాపారవేత్త రితేష్ టాండన్ పోటీ చేస్తున్నారు.
ప్రమీలా జయపాల్ వర్సెస్ నిరవ్ షేత్..
వాషింగ్టన్ స్టేట్‌లోని 7వ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా ప్రమీలా జయపాల్ పోటీ చేస్తున్నారు. కేరళతో కుటుంబ మూలాలున్న ఆమెకు ప్రత్యర్థిగా గుజరాత్లో జన్మించిన మాజీ అమెరికా మెరైన్ నిరవ్ షేత్ బరిలో ఉన్నారు. 2017 నుంచి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రమీలా జయపాల్, అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ మహిళగా గుర్తింపు పొందారు.
అమీ బెరా..
కాలిఫోర్నియాలోని 3వ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి డెమోక్రటిక్ పార్టీకి చెందిన అమీ బెరా మరోసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యేందుకు పోటీ చేస్తున్నారు. రాజ్‌కోట్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన గుజరాతీ తల్లిదండ్రులకు ఆయన అమెరికాలో జన్మించారు. అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన మూడో భారతీయ అమెరికన్‌గా అమీ బెరాకు గుర్తింపు ఉంది.
పూజా సేథి..
టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధుల సభలోని 47వ నియోజకవర్గం నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా పూజా సేథి పోటీలో ఉన్నారు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన ఆమె గతంలో టెక్సాన్ శాసనసభ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేశారు.
సందీప్ శ్రీవాత్సవ..
టెక్సాన్ రాష్ట్ర ప్రతినిధుల సభలోని 66వ నియోజకవర్గం నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా సందీప్ శ్రీవాస్తవ పోటీలో ఉన్నారు. వ్యాపారవేత్త , యాక్టివిస్ట్‌గా గుర్తింపు పొందారు. ఈ నియోజకవర్గంలో ఐదు సార్లు గెలిచిన రిపబ్లికన్ నేతకు సవాల్ విసురుతున్నారు.
పియా దండియా..
ఫ్లోరిడాలోని 22వ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా పియా దండియా పోటీ చేస్తున్నారు. గతంలో హైస్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన ఆమె. రిపబ్లికన్ అభ్యర్తీ కేసీ అస్కర్తో పోటీ పడుతున్నారు. పియా దండియా ప్రస్తుతం 11 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
అమిష్ షా..
అరిజోనా రాష్ట్ర మాజీ ప్రతినిధిగా పనిచేసిన అమిష్ షా.. అరిజోనాలోని 1వ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ కిక్కర్ జే ఫీలీ బరిలో ఉన్నారు. ఫీలీకి ట్రంప్ మద్దతు ఉంది. అరిజోనా ప్రతినిధుల సభకలో అమిస్ షా గతంలో మూడు పర్యాయాలు పనిచేశారు. 2024 కాంగ్రెస్ ఎన్నికల్లోనూ పోటీ చేసి రిపబ్లికన్ అభ్యర్థి డేవిడ్ ష్వైకర్ట్ చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.
నిత్యా రామన్..
లాస్ ఏంజెల్స్ నగర కౌన్సిల్ సభ్యురాలు, అర్బన్ ప్లానర్ అయిన నిత్య రామన్ ఆ నగర మేయర్ పదవికి పోటీ చేస్తున్నారు. ఆమె విజయం సాధిస్తే భారతీయ మూలాలున్న మేయర్లు అమెరికాలోని రెండు అతిపెద్ద నగరాలైన న్యూయార్క్, లాస్ ఏంజెల్స్‌కు నాయకత్వం వహించే అవకాశం ఉంటుంది. న్యూయార్క్ నగరానికి ప్రస్తుతం జొహ్రాన్ మమ్దానీ మేయర్‌గా ఉన్నారు

