సీరియల్ రికార్డ్ బ్రేకర్‌గా పేరుగాంచిన అమెరికాకు చెందిన డేవిడ్ రష్ చరిత్ర తిరగరాశాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకే రోజు 15 ప్రపంచ గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకున్నాడు. అమెరికాలోని ఇడాహోకు చెందిన డేవిడ్ రష్.. ఇప్పటి వరకు 250 ప్రపంచ రికార్డులను బద్ధలు కొట్టాడు. ఇక తాజాగా ఒక్కరోజులోనే 15 రికార్డులను నెలకొల్పి చరిత్ర సృష్టించాడు.
ఇటీవల లండన్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ హెడ్‌క్వార్టర్స్‌ను డేవిడ్ రష్ సందర్శించాడు. తన దగ్గర ఉన్న 180 శీర్షికలను వేలం వేసేందుకు వెళ్లాడు. డేవిడ్.. ఒకే రోజు 15 రికార్డులు ఎలా బద్దలు కొట్టాడో ఆశ్చర్యంగా ఉందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక న్యాయనిర్ణేత విల్ సిండెన్ పేర్కొన్నారు.
డేవిడ్ రష్ మొదట గారిడీ విద్య నేర్చుకున్నాడు. ప్రజలను ఆకట్టుకునే అనేక ప్రదర్శనలు ప్రదర్శించాడు. ఒక నిమిషంలో మూడు ఆపిల్స్ నోటితో తింటూ రికార్డు నెలకొల్పాడు. ఇక టేబుల్ టెన్నిస్ బంతిని రెండు బాటిల్ క్యాప్స్‌పై పదిసార్లు ప్రత్యామ్నాయ చేతులతో బౌన్స్ చేశాడు. కేవలం 2.09 సెకన్లలో గమ్మత్తైన ఫీట్‌ను సాధించాడు. ఇలా ఒకటేంటి? ఏకంగా 250 వరల్డ్ గిన్నిస్ రికార్డులు డేవిడ్ ఖాతాలో ఉన్నాయి.