US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు

  • అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం..
  • ట్రంప్ అనుమతి కోసం ఎదురుచూపులు..
  • అంతర్జాతీయ మీడియా నివేదిక..
Us Iran Talks

Us Iran Talks

US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఘర్షణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు దేశాలు కూడా తాత్కాలిక శాంతి ఒప్పందానికి సిద్ధమైనట్లు ఆక్సియోస్ నివేదిక వెల్లడించింది. అయితే, ఈ ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుది ఆమోదం తెలపాల్సి ఉంది. ఇంకా రెండు రోజులు ఆలోచించాలని అనుకుంటున్నట్లు ట్రంప్, మధ్యవర్తులుగా ఉన్న దేశాలకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. అమెరికా, ఇరాన్ ప్రతినిధులు 60 రోజుల తాత్కాలిక అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) రూపొందించేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఈ ఒప్పందం ప్రకారం, ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణ పొడగించడంతో పాటు ఇరాన్ అణు కార్యక్రమాలపై చర్చలు తిరిగి ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఒప్పందంలోని చాలా అంశాలపై రెండు దేశాలు అంగీకరిచాయని, ఇరాన్ నాయకత్వం కూడా దీనికి ఆమోదం తెలపిందని, అయితే ట్రంప్ ఆమోదం కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

×
×
Ad

ఈ డీల్‌లో భాగంగా ప్రపంచ చమురు రవాణాకు కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని పూర్తిగా స్వేచ్ఛాయుత నౌకాయానానికి అనుమతించడం, 30 రోజుల్లో సముద్రంలో సీమైన్లను ఇరాన్ తొలగించాల్సి ఉంటుంది. వాణిజ్య నౌకలకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదని, దీనికి ప్రతిగా అమెరికా తన నౌకాదళ ఆంక్షల్ని క్రమంగా సడలించుకుంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ 60 రోజులు ఇరాన్ తన అణు ఆయుధాల అభివృద్ధి కొనసాగించమని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. శుద్ధి చేసిన యురేనియంపై భవిష్యత్తులో రెండు దేశాలు చర్చించనున్నాయి. విదేశీ బ్యాంకుల్లో ఫ్రీజ్ చేసిన ఇరాన్ నిధులు, ఆర్థిక ఆంక్షల సడలింపు వంటివి చర్చల్లో భాగం కానున్నాయి.

అయితే, ఈ ఒప్పందం తాత్కాలికమే అని, పూర్తిస్థాయి డీల్ కాదని అధికారులు చెబుతున్నారు. ఒక పక్క శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అలాగే ఉన్నాయి. అమెరికా ఇరాన్ డ్రోన్ కేంద్రాలపై దాడులు చేసింది. ఇరాన్ కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని అటాక్ చేసింది.