Ismail Haniyeh: హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియేని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఈ హత్య జరిగింది. ఇజ్రాయిల్-హమాస్ పోరులో ఇది కీలక పరిణామంగా మారింది. అక్టోబర్ 07 నాటి దాడుల తర్వాత ప్రతీ ఒక్క హమాస్ కార్యకర్తని మట్టుబెడతామని ఇజ్రాయిల్ పలు సందర్భాల్లో చెప్పింది. అయితే, అత్యంత రక్షణ ఉన్న ఇరాన్ వంటి హమాస్ మిత్రదేశంలోనే హనియేని హతమార్చడం సంచలనంగా మారింది. అయితే, ఇప్పటి వరకు ఎలా, ఎవరు చంపారనే విషయం వెలుగులోకి రాకున్నప్పటికీ, ఈ హత్యలో ఇజ్రాయిల్ మొస్సాద్ ప్రమేయం ఉందని హమాస్ ఆరోపిస్తోంది. మరోవైపు ఈ హత్యకు ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని ఇటు ఇరాన్‌తో పాటు అటు హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ హెచ్చరించింది.
Read Also: Pinnelli Ramakrishnareddy: పిన్నెల్లికి మరోసారి చుక్కెదురు.. బెయిల్ నిరాకరణ
ఇదిలా ఉంటే హమాస్ నేత హనియే హత్యలో అమెరికా ప్రమేయం లేదని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ బుధవారం తెలిపారు. సింగపూర్ పర్యటన సందర్భంగా ఛానల్ న్యూస్ ఏషియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్లింకెన్ మాట్లాడుతూ.. దీని గురించి మాకు తెలియదని, దీంట్లో మా ప్రమేయం లేదని చెప్పారు. ఇరాన్ కొత్త దేశాధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి హాజరైన కొన్ని గంటల తర్వాత హనియే మరణాన్ని ఇరాన్‌లోని రివల్యూషనరీ గార్డ్స్ ధృవీకరించారు.
ఖతార్‌లో ఆశ్రయం పొందుతున్న హనియే, ఈ ప్రమాణస్వీకారం కోసమే టెహ్రాన్ వచ్చి, హత్యకు గురయ్యాడు. హమాస్-ఇజ్రాయిల్ పోరులో దౌత్యానికి అంతర్జాతీయంగా ఇతనే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇజ్రాయిల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌లో రాకెట్ దాడి చేసి, 12 మంది మరణానికి కారణమైన హిజ్బుల్లా కమాండర్‌ని ఇజ్రాయిల్ హతమార్చిన 24 గంటల్లోనే హనియే హత్య జరిగింది.