Banker Death: అమెరికాలో 35 ఏళ్ల బ్యాంకర్ మరణం సంచలనంగా మారింది. పని ఒత్తిడి, వర్క్ కల్చర్ అతడి మరణానికి కారణమని వాల్ స్ట్రీట్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సుదీర్ఘ వారాల పాటు పనిచేయడం వల్లే మరణించారని మిగతా బ్యాంకర్లు ఆరోపిస్తున్నారు. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. లియో లుకెనాస్-3 మే 2న ‘‘అక్యూట్ కరోనరీ ఆర్టరీ త్రంబస్’’తో మరణించారు. ఇతను బ్యాంక్ ఆఫ్ ఆమెరికాకు సంబంధించిన ఫైనాన్సియల్ ఇన్‌స్టిట్యూట్ గ్రూపులో పనిచేస్తున్నారు. అతని మరణానికి మూడు రోజుల ముందు 2 బిలియన్ డాలర్ల విలీనం పూర్తయింది. దీనిపై అతను అనేక వారాలుగా పనిచేసినట్లు, వారానికి 100 గంటల పనిచేసిన తర్వాత అతని మరణం సంభవించినట్లు తెలుస్తోంది.
Read Also: Navneet Kaur Rana: ఒవైసీ సోదరులకు నవనీత్ కౌర్ మరో వార్నింగ్
లుకెనాస్ మరణంపై తోటి బ్యాంకర్లు ప్రతిస్పందన తీవ్రంగా ఉంది. బ్యాంక్ ఆఫ్ అమెరికాతో సహా అనేక ఆర్థిక సంస్థల్లో వర్క్ కల్చర్‌పై చాలా మంది మండిపడుతున్నారు. లుకెనాస్ బాస్ గ్యారీ హూవేని బ్యాంక్ ఉద్యోగులు దూషిస్తున్నారు. కొంత మంది ఉద్యోగులు మెరుగైన పని పరిస్థితుల కోసం డిమాండ్ చేశారు. దీని కోసం బేరసారాలు చేసేందుకు వాకౌట్ గురించి ఉద్యోగులు సందేశాలు కూడా పంపుకున్నారు. ఒక బ్యాంకర్ ఉద్యోగుల సంక్షేమం కోసం డిమాండ్లను సోషల్ మీడియాలో హైలెట్ చేశారు. 7 రోజల వ్యవధిలో సగటున 80 గంటల పని షెడ్యూల్‌లను పరిమితం చేసే ప్రోయాక్టివ్ పాలసీలను, ఉద్యోగులు నెలకు కనీసం ఒక వారాంతపు సెలవు ఉండాలని డిమాండ్ చేశారు. లుకెనాస్ మరణంపై కూడా విచారణ చేయాలని పిలుపునిచ్చారు.
మరోవైపు, బ్యాంక్ ఆఫ్ అమెరికా మాట్లాడుతూ.. చనిపోయిన లుకెనాస్ బాస్ హూవేపై చర్య తీసుకోవడానికి, వారానికి 100 గంటలు పనిచేయాలని ఒత్తిడిపై బ్యాంకర్లు చేసిన ఫిర్యాదుపై ఎలాంటి దర్యాప్తు చేసే ప్లాన్ లేదని పేర్కొంది. మా సహచరుడని కోల్పో్యినందుకు మేము చాలా బాధపడ్డాము, అతని కుటుంబానికి, అతనితో సన్నిహితంగా పనిచేసని వారికి మద్దతు ఇవ్వడానికి మేము చేయగలిగినదంతా చేయడంపై దృష్టి సారిస్తామని బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రతినిధి పోస్ట్ చేశారు. లుకెనాస్‌కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.