ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కాంగో హక్కుల కార్యకర్త చెప్పిన ఓ మహిళ ధీనగాథ అందరి చేత కంటతడి పెట్టించింది. కాంగోలో మానవహక్కులు ఏ విధంగా ఉన్నాయో తెలిపేందుకు సదరు హక్కుల కార్యకర్త, ఓ మహిళ పడిన కష్టాన్ని 15 దేశాల సభ్యులు ఉండే భద్రతా మండలిలో వివరించింది. కాంగోలో అంతర్యుద్ధం కారణంగా ప్రజలు పడుతున్న బాధలను తెలిపేలా, మిలిటెంట్ల రాక్షసత్వాన్ని తెలిపేలా ఈ ఘటన ఉంది.
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మిలిటెంట్లు రెండు సార్లు కిడ్నాప్ చేసి, గ్రూపు సభ్యులంతా అత్యాచారం చేసి చివరకు మనిషి మాంసాన్ని తినేలా చేశారని కాంగో హక్కుల సంఘం బుధవారం యూఎన్ఓ సెక్యురిటీ కౌన్సిల్ కు తెలిపింది. మహిళా హక్కుల సంఘం మహిళా సాలిడారిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ పీస్ అండ్ డెవలప్‌మెంట్ (ఎస్ఓఎఫ్ఈపీఏడీఐ) ప్రెసిడెంట్ జులియెన్ లుసెంగే, కాంగో దేశంలోని తూర్పు ప్రాంతంలో జరుగుతున్న సంఘర్షణను తెలియజేసింది.
కిడ్నాప్ కు గురైన తన కుటుంబ సభ్యుడిని విడిపించేందుకు ఉగ్రవాదులుకు డబ్బు ఇచ్చేందుకు వెళ్లిన ఓ మహిళను కోడెకో ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని లుసెంగే తెలిపారు. తరువాత ఆ మహిళను నిర్భధించి పదేపదే అత్యాచారానికి పాల్పడ్డారని.. శారీరకంగా వేధింపులకు గురిచేశారని తెలిపింది. ఇంతటితో ఆగకుండా ఓ వ్యక్తి గొంతు కోసి చంపేసి, అతని పేగులను బయటకు తీసి వాటిని వండాలని మహిళను వేధించారని.. మిగిలిన భోజనాన్ని సిద్ధం చేయడానికి రెండు కంటైనర్ల నీటిని మహిళకు ఇచ్చి, వండిన మానవ మాంసాన్ని ఖైదీలతో తినిపించారని ఆ మహిళ కథను యూఎన్ఓకు తెలియజేసింది.
కొన్ని రోజుల తర్వాత మహిళను విడుదల చేశారని.. అయితే ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో మరో మిలిటెంట్ గ్రూప్ ఆమెను కిడ్నాప్ చేసి, మిలిటెంట్లు పదేపదే అత్యాచారానికి పాల్పడ్డారని.. మానవ మాంసాన్ని ఉడికించి తినమని సదరు మహిళను అడిగారని, అక్కడ నుంచి మహిళ తప్పించుకుందని హక్కుల కార్యకర్త యూఎన్ కు తెలిపింది. కాంగోలో ఖనిజాలు అధికంగా ఉండే తూర్పు ప్రాంతంలో భూమి, వనరులపై చాలా కాలంగా పోరాటాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలోని మిలిటెంట్ గ్రూపులు గత దశాబ్ధకాలంలో వేలాది మంది ప్రజలను చంపారు.
