Ukrainians celebrate Russia’s retreat from Kherson: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా చేతులెత్తేస్తోంది. గతంలో స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ భూభాగాలను వదిలిపెట్టి వెనక్కి వెళ్తున్నాయి. గతంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్ నుంచి రష్యా బలగాలు వెనుదిరిగాయి. ఇదిలా ఉంటే తాజాగా ఖేర్సన్ నుంచి రష్యా బలగాలు వెనుదిగిరిగాయి. దీంతో ఉక్రెయిన్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. నెల క్రితం రష్యా ఉక్రెయిన్ లోని ఖేర్సన్, లూహన్స్క్, డోనెట్స్క్, జపొరిజ్జియా ప్రాంతాలను తనలో విలీనం చేసుకుంది. అయితే ఇప్పుడు ఇందులోని ఖేర్సన్ నుంచి రష్యా బలగాలు వెనుదిరిగాయి.
Read Also: T20 World Cup Final 2022: టీ20 ఛాంపియన్‌గా ఇంగ్లాండ్.. పాకిస్తాన్‌పై ఘన విజయం
రష్యా ఎప్పటీకి ఉక్రెయిన్ లోనే ఉంటుందని పుతిన్ అనుకున్నారని.. కానీ వారు ఐదు నిమిషాల్లోనే మేకల్లా పారిపోయారని ఉక్రెయిన్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుతిన్ మమ్మల్ని చంపాలని అనుకున్నాడని.. అతను తమ దేశాన్ని నాశనం చేశాడని, ఖేర్సన్ నుంచి రష్యా వైదొలగడం ఆ దేశ వైఫల్యం అని అక్కడి ఉక్రెయిన్ ప్రజలు పేర్కొంటున్నారు. ఖేర్సన్ నగరంలోని రష్యా సైనికులకు లాజిస్టిక్ సపోర్టు ఇవ్వడం సాధ్యం కాకపోవడంతో రష్యన్ బలగాలు అక్కడి నుంచి వైదొలిగాయి. దీంతో స్థానికులు రష్యా బలగాలు వెళ్తున్న క్రమంలో ఉక్రెయిన్ జాతీయ జెండాలను ఊపుతూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
శనివారం పోలీసులు, టీవీ, రేడియో సేవలు ఖేర్సన్ నగరంలోకి అందుబాటులోకి వచ్చాయి. రష్యా బలగాలు వెనుదిరగడంతో స్థానికులు రోడ్లపైకి వచ్చి జాతీయగీతం పాడుతూ, ఉక్రెయిన్ సైన్యానికి మద్దతుగా నినాదాలు చేశారు. అయితే యుద్ధ నేపథ్యంలో ఖేర్సన్ నగరం చాలా దెబ్బతింది. దాన్ని పునర్నిర్మించడం చాలా సవాళ్లతో కూడుకున్నదని అధికారులు చెబుతున్నారు. నీరు, విద్యుత్, ఆహారం వంటి సదుపాయాలు కల్పించాల్సి ఉంది. రష్యా బలగాలు ఖేర్సన్ వదిలిపోతున్న సమయంలో మౌళికసదుపాయాలను నాశనం చేసినట్లు, కమ్యూనికేషన్, నీటి సరఫరా, విద్యుత్ వ్యవస్థలను నాశనం చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ఆరోపించారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ 70 శాతం ఖేర్సన్ ప్రాంతం రష్యా నియంత్రణలోనే ఉంది.
