NTV Telugu Site icon

Ukraine: రష్యా ఆధీనంలోని క్రిమియాలోకి ప్రవేశించిన ఉక్రెయిన్‌ సైన్యం

Ukraine

Ukraine

Ukraine: రష్యా ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. చిన్న దేశం ఏమి చేస్తుందిలే అనుకున్న రష్యాకు ఉక్రెయిన్‌ ధీటుగానే సమాధానం ఇస్తోంది. రెండు రోజుల క్రితం డ్రోన్లతో మాస్కో నగరంపై దాడి చేసిన ఉక్రెయిన్‌ ఇపుడు ఏకంగా రష్యా అధీనంలోని క్రిమియాలోకి తన సైన్యాన్ని పంపించింది. ఉక్రెయిన్‌ రహస్య బృందాలు క్రిమియాలోకి ప్రవేశించడమే కాకుండా భారీగా దాడులు చేశాయి. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఉక్రెయిన్‌ ఇంటెలిజెన్స్‌ ఓ ఆంగ్లపత్రికకు వెల్లడించింది. క్రిమియా పశ్చిమ తీరంలోని ఒలెన్విక, మయాక్‌ ప్రాంతాల్లో తమ దేశ నౌకాదళంతో కలిసి ప్రత్యేక దళాలు దాడులు చేశాయని చెప్పారు. ‘ఆపరేషన్‌ పూర్తి చేసే క్రమంలో తమ ఉక్రెయిన్‌ దళాలు ఆక్రమణదారులైన రష్యా దళాలతో పోరాడాయని… ఈ దాడిలో ప్రత్యర్థులు భారీగా ఆయుధాలను, దళాలను కోల్పోయారని ఉక్రెయిన్‌ డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ పేర్కొంది. అంతేకాకుండా తమ దళాలు అక్కడ ఉక్రెయిన్‌ పతాకాన్ని ఎగురవేశాయని స్పష్టం చేసింది.

Read Also: Bray Wyatt Dead: 36 ఏళ్ల వయసులోనే.. డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ బ్రే వ్యాట్ మృతి!

క్రిమియా పశ్చిమ ప్రాంతంలోని కేప్‌ తర్ఖాన్‌కుట్‌ వద్ద గగనతలం ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలతో అత్యంత కఠినంగా ఉంటుంది. అయినప్పటికీ అక్కడే ఇటీవల ఉక్రెయిన్‌ ఒక ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. అంతేకాకుండా.. మయాక్‌ ప్రాంతంలో రష్యాకు చెందిన రేడియో ఇంజినీరింగ్‌ రెజిమెంట్‌ వద్ద కూడా దాడి జరిపినట్టు తెలుస్తోంది. ఇక్కడ అత్యంత శక్తిమంతమైన రాడార్‌ కేంద్రం ఉంది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం రబ్బర్‌ బోట్లలో వచ్చిన 10 మంది వ్యక్తులు .. క్యాంప్‌ సైట్‌పై భారీగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. రష్యాపై ఎదురు దాడులు మొదలుపెట్టిన నాటి నుంచి తాజాగా చేపట్టిన ఆపరేషనే అత్యంత కఠినమైందని నిపుణులు చెబుతున్నారు. రష్యా మిలటరీ బ్లాగ్‌ కూడా కేప్‌ తర్ఖాన్‌కుట్‌ తీరంలోకి ఉక్రెయిన్‌కు చెందిన సాబోటాజ్‌ అండ్‌ రికానసెన్స్‌ బృందం వచ్చిందని పేర్కొంది. ఇక్కడ ఆపరేషన్‌ తర్వాత ఆ బృందం ఒడెస్సా దిశాగా వెళ్లిపోయిందని తెలిపింది. దొనెట్స్క్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌కు చెందిన మిలిషియా బృందం కూడా ఈ దాడిని ధ్రువీకరించింది. రష్యా దళాలు వీటిని తిప్పికొట్టాయని.. దాదాపు 20 మంది వరకు మరణించారని పేర్కొంది. ఈ దాడులకు సంబంధించిన చాలా వీడియోలను ఉక్రెయిన్‌ ఇంటెలిజెన్స్‌ ఇప్పటికే విడుదల చేసింది.