Ukraine Drone Attack On Naval Fleet In Crimea: రష్యా-ఉక్రెయిన్ మధ్య రోజురోజు యుద్ధ తీవ్రత పెరుగుతోంది. క్రిమియాలోని కేర్చ్ బ్రిడ్జ్ కూల్చేసిన తర్వాత నుంచి రష్యా, ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. ఇదిలా ఉంటే క్రిమియాలోని నల్ల సముద్రం ఉన్న రష్యా నౌకాదళంపై డ్రోన్లతో దాడి జరిగింది. ఈ దాడి ఉక్రెయిన్ చేసిందని రష్యా ఆరోపిస్తోంది. అయితే తాము ఈ దాడికి పాల్పడలేదని ఉక్రెయిన్ తోసిపుచ్చుతోంది. రష్యాలో విలీన ప్రాంతమైన క్రిమియాలో సెవాస్టోపోల్ కేంద్రంగా ఇటీవల పలుమార్లు దాడులు జరిగాయి. ఇది రష్యా నౌకాదళం ప్రధాన కార్యాలయంగా, ఉక్రెయిన్ యుద్ధంలో కార్యకలాపాల కోసం లాజిస్టిక్ హబ్ గా ఇది పనిచేస్తోంది.
శనివారం తెల్లవారుజామున ఓడరేపులో జరిగిన దాడిలో రష్యా సైన్యం తొమ్మిది ఏరియల్ డ్రోన్లను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. దక్షిణ ఉక్రెయిన్ నగరం అయిన ఓచకివ్ లో ఉన్న బ్రిటన్ నిపుణులు ఈ దాడి చేసేందుకు ఉక్రెయిన్ కు శిక్షణ ఇచ్చినట్లు రష్యన్ బలగాలు ఆరోపించాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికాతో పాటు యూకే దేశాలు ఉక్రెయిన్ కు బలమైన మద్దతుదారులుగా నిలుస్తున్నాయి. గతంలో కూడా నార్డ్ స్ట్రీమ్ గ్యాస్ పైప్ లైన్ పై దాడిలో బ్రిటన్ పాల్గొన్నట్లు రష్యా ఆరోపించింది. అయితే బ్రిటన్ మాత్రం రష్యా ఆరోపణల్ని తోసిపుచ్చింది. ఆగస్టులో కూడా ఇలాగే రష్యా నౌకాదళంపై డ్రోన్ దాడి జరిగింది.
శనివారం జరిగిన దాడి క్రిమియాపై ఇప్పటి వరకు జరిగిన పెద్ద దాడుల్లో ఒకటని సెవాస్టోపోల్ గవర్నర్ మికాయిల్ రజ్వోజాయేవ్ అన్నారు. 2014లో రష్యా, క్రిమియాను ఆక్రమించింది. అప్పటి నుంచి క్రిమియాను సొంతం చేసుకునేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోంది. అక్టోబర్ నెలలో క్రిమియాను రష్యాతో కలిసే కెర్చ్ బ్రిడ్జ్ పై ఉక్రెయిన్ దాడి చేసింది. ఈ దాడి తర్వాత ఉక్రెయిన్ నగరాలపై ఇరాన్ తయారీ కామికేజ్ డ్రోన్ల సహాయంతో రష్యా భీకరంగా దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థను దెబ్బతీసేలా పలు విద్యుత్ కేంద్రాలపై రష్యా దాడులు చేస్తోంది. ఇప్పటికే అక్కడి చాలా నగరాలు విద్యుత్ లేక అల్లాడుతున్నాయి.
