రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయి దాదాపుగా నాలుగో నెలకు చేరింది. ఇరు దేశాలు కూడా వెనక్కి తగ్గడం లేదు. రష్యా బలగాలకు ధీటుగా ఉక్రెయిన్ నిలబడుతోంది. రష్యా, ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించిన తర్వాత నుంచి అమెరికా, నాటో దేశాలు ఆర్థికంగా, సైనికంగా సహాయపడుతున్నాయి. రష్యాను ధీటుగా ఎదుర్కొనేందు స్ట్రింగర్ మిసైళ్లు, ఇతర ఆయుధాలను, కమ్యూనికేషన్ వ్యవస్థతో పాటు సైనిక వ్యూహాలను అందిస్తున్నాయి అమెరికా, నాటో దేశాలు.
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ కు 40 బిలియన్ డాలర్ల భారీ సహాయాన్ని ప్రకటించింది యూఎస్ఏ. 40 బిలియన్ డాలర్లను విడుదల చేస్తూ శనివారం ప్రెసిడెంట్ జో బైడెన్ సంతకం చేశారు. గతంలో కూడా ఇలాగే అమెరికా 13 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించింది. తాజాగా 40 బిలియన్ డాలర్లలో 20 బిలియన్ డాలర్లను కేవలం రష్యాపై పోరాడేందుకు ఆయుధాల కోసం, సైనిక సహాయం కోసం వినియోగించనుంది. యుద్ధం వల్ల దెబ్బతిన్న సాధారణ పరిపాలనను గాడిలో పెట్టేందుకు 8 బిలియన్ డాలర్లను వినియోగించనున్నారు. వ్యవసాయ రంగం పతనం కావడం వల్ల తీవ్ర ఆహార కొరత నెలకొంది. దీన్ని అధిగమించేందుకు 5 బిలియన్ డాలర్లను వినియోగించనున్నారు. మరో బిలియన్ డాలర్లను శరణార్థి సంక్షేమం కోసం వినియోగించనున్నారు.
బలమైన రష్యా ముందు ఎదురొడ్డి నిలిచేందుకు ఉక్రెయిన్ కు అమెరికా ఇస్తున్న ఆర్థిక, సైనిక సాయమే కారణం. యుద్దం ప్రారంభం అయినప్పుడు కొన్ని వారాల్లోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని అంతా అనుకున్నారు. అయితే అమెరికా, బ్రిటన్ తో పాటు నాటో దేశాలు సైనికంగా, వ్యూహాత్మక సహాయాన్ని అందించడంతో పోరులో ఉక్రెయిన్ గట్టిగా నిలుస్తోంది. నాటో ఇచ్చిన ఆయుధాలు, వ్యూహాలతోనే రష్యాను ఉక్రెయిన్ నిలువరిస్తోంది. అమెరికా వ్యూహాలతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను రష్యా స్వాధీనం చేసుకోకుండా నిలువరించింది.