Site icon NTV Telugu

River Thames: ఇంగ్లండ్ కు పొంచి ఉన్న కరువు ముప్పు.. ఎన్నడూ లేనంతగా ఎండిపోయిన థేమ్స్ నది

Thames River Uk

Thames River Uk

Source of River Thames dries out for first time: యూకే కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇటీవల భారీగా నమోదైన ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం, సరైన వర్షాలు కురవకపోవడంతో ప్రఖ్యాత థేమ్స్ నది ఎండిపోతోంది. చాలా ప్రాంతాల్లో నీటి మట్టాలు కనిష్ట స్థాయికి చేరడంతో పాటు కొన్ని చోట్ల నీటి ఆనవాళ్లు కూడా లేకుండా ఎండిపోయింది. 1935 తర్వాత ఎన్నడూ లేని విధంగా గత నెలలో ఇంగ్లాండ్ వ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఎండల ధాటికి యూకే ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. ఎండల వల్ల రైళ్లను ఎక్కడికక్కడ నిలిపేశారు. ఇక ట్రాఫిక్ సిగ్నల్స్ తో పాటు రోడ్లు, విమాన రన్ వేలపై తారు కరిగిపోయేలా ఎండలు నమోదు అయ్యాయి. లండన్ హీత్రూ ప్రాంతంలో 40 డిగ్రీలను దాటి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

Read Also: Wife Second Marriage: నాకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకొంది.. భార్యపై భర్త ఫిర్యాదు

థేమ్స్ నది ఎండిపోవడం వల్ల ఇంగ్లండ్ లో కరువు వచ్చే పరిస్థితి ఉందని.. దీనికి దేశం ఇంకా సిద్ధంగా లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జూలై నెలలో అత్యంత పొడి వాతావరణం ఏర్పడింది. దీంతో పాటు సగటు వర్షపాతం 23.1 మిల్లీమీటర్ల నమోదు అయింది. ఇది నెలలో సగటు వర్షపాతంలో 35 శాతం మాత్రమే. థేమ్స్ నది తూర్పున ఎసెక్స్ వద్ద సముద్రంలోకి ప్రవేశించే ముందర.. పశ్చిమాన గ్లౌసెస్టర్ షైర్ నుంచి లండన్ మహానగరం మీదుగా 356 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ నది పుట్టుకకు కారణం అయిన సహజ నీటి బుగ్గలు ఈ వేసవిలో ఎండిపోయాయి. దీంతో నదీ ప్రవాహం తగ్గిపోయింది.

థేమ్స్ నది ఇంగ్లాండ్, లండన్ ప్రజలకు మంచి నీటి సరఫరాకు అత్యంత ముఖ్యమైంది. దాదాపుగా 1.5 కోట్ల జనాభా దీనిపై ఆధారపడి ఉన్నారు. ఆగస్టులో ఇంగ్లాండ్ లో వర్షాలు కురవకపోతే.. పొడి శీతాకాల పరిస్థితులు ఉంటే వచ్చే వేసవి కాలంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంగ్లాండ్ లో సెవెర్న్ తరువాత థేమ్స్ రెండో అతిపెద్ద నది.

Exit mobile version