రాజుల సొమ్ము రాళ్ల పాలు అంటారు పెద్దలు. ఈ సామెత ఎందుకు పుట్టిందో తెలియదు గానీ.. తాజాగా అంతర్జాతీయంగా వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన ఆశ్చర్యం గొల్పోతుంది. యూకే కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి అక్షరాల 72 మిలియన్ పౌండ్లు ఖర్చు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అంటే అక్షరాల ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.765 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వ నివేదిక తెలిపింది.
బ్రిటన్ రాజుగా చార్లెస్ గత సంవత్సరం 2023, మే నెల 6న పట్టాభిషేకం జరిగింది. 40వ బ్రిటన్ చక్రవర్తిగా ఆయన రికార్డ్ సృష్టించారు. 2022, సెప్టెంబర్‌లో తల్లి ఎలిజబెత్-2 మరణించడంతో చార్లెస్ రాజు అయ్యారు. వెస్ట్ మినిస్టర్ అబేలో సంప్రదాయబద్ధంగా ఈ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి జగ్‌దీశ్ ధన్‌కర్‌తో సహా ప్రపంచం నలుమూలల నుంచి ప్రతినిధులు తరలివచ్చారు. యితే ఈ పట్టాభిషేకానికి రూ.765 కోట్లు ఖర్చు చేసినట్లుగా తాజా నివేదికలో వెల్లడైంది. వేదిక కోసమే 50.3 మిలియన్ పౌండ్లు ఖర్చయిందని, పోలీసింగ్ ఖర్చుల కోసం మరో 21.7 మిలియన్ పౌండ్లు ఖర్చయిందని సాంస్కృతిక శాఖ తెలిపింది.
ఇక కింగ్ చార్లెస్-3కి భారత్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన యువరాజుగా ఉన్నప్పుడు 2007లో భారత్‌లో పర్యటించారు. 2019 నవంబర్‌లో కూడా ఆయన భారత్‌కు వచ్చారు. ముంబైలో పాఠశాల విద్యార్థులతో కలిసి తన 71వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు కచ్చితంగా తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని నొక్కిచెప్పేవారు. 2018 ఏప్రిల్‌లో లండన్‌లో భారత ప్రధాని నరేంద్రమోడీతో కలిసి సైన్స్ మ్యూజియం, న్యూ ఆయుర్వేదిక్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రారంభించారు. భారత సంప్రదాయాలైన ఆయుర్వేదం, యోగాకు చాలా సందర్భాల్లో ప్రచారం కల్పించారు. ఇటీవల కొద్దిరోజుల క్రితం కూడా భారత్‌లోనే బెంగళూరులో చార్లెస్ దంపతులు వారం రోజులు పర్యటించి వెళ్లారు.