UAE: యూఏఈలో బస్సు-ట్రక్కు ఢీ.. 13 మంది మృతి, మృతుల్లో భారతీయులు!

  • యూఏఈ రస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం..
  • బస్సు-ట్రక్కు ఢీ, 13 మంది మృతి, మృతుల్లో భారతీయులు..
Uae Accident

Uae Accident

UAE: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (UAE)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాస్ అల్ ఖైమా ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో భారతీయులు కూడా ఉన్నట్లు దుబాయ్‌లోని భారత కాన్సులేట్ వెల్లడించింది. అయితే, ఎంత మంది భారతీయులు మరణించారనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాస్ అల్ ఖైమాలోని అల్ వతన్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. 41 మందిలో వెళ్తున్న ప్రయాణికుల బస్సు, సాంకేతిక సమస్య కారణంగా రోడ్డు పక్కనే నిలిపి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో తొలుత 11 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో మృతుల సంఖ్య 13కు చేరింది. ఈ ఘటనలో మరో 14 మంది గాయపడ్డారు.

ఈ ప్రమాదంలో భారతీయులు మరణించడంపై దుబాయ్‌లోని భారత కాన్సులేట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసింది. వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. బాధితులకు సహాయం అందించేందుకు 24 గంటల పాటు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 800-46342ను కూడా ప్రకటించింది.

దీనికి ముందు యూఏఈలో నవంబర్ 13న ఫుజైరాలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 23 వాహనాలు, ట్రక్కులు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 14 మంది మరణించగా, వీరిలో నలుగురు భారతీయులు ఉన్నారు. మరో 30 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఏడుగురు భారతీయులు ఉన్నారు.