ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును టర్కీ టార్గెట్ చేసింది. నెతన్యాహుపై ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు జారీ చేయాలని టర్కీ కోరింది. గాజాకు మానవతా సాయం, కార్యకర్తలను తీసుకెళ్తున్న గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లాను ఇజ్రాయెల్ అడ్డుకోవడానికి సంబంధించిన కేసులో నెతన్యాహుపై టర్కీ ఈ చర్యకు దిగింది. ఈ వ్యవహారంలో మారణహోమం, మానవత్వానికి వ్యతిరేక నేరాలు సహా పలు ఆరోపణలు ఉన్నాయని అంకారా పేర్కొంది.
టర్కీ న్యాయశాఖ మంత్రి అకిన్ గుర్లెక్ శుక్రవారం మాట్లాడుతూ.. నెతన్యాహు, ఈ కేసులో మరో నిందితుడు అఫెక్ మోస్కోవిచ్‌పై ఇంటర్‌పోల్ రెడ్ నోటీసులు కోరుతూ న్యాయశాఖ.. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖను అభ్యర్థించిందని తెలిపారు. దీనికి సంబంధించిన పత్రాలను విదేశాంగ మంత్రిత్వ శాఖకు కూడా పంపినట్లు వెల్లడించారు.
జూలై 14న అరెస్ట్ వారెంట్లు
నెతన్యాహు, మోస్కోవిచ్‌పై ‘మారణహోమం’ ఆరోపణలతో జూలై 14న అరెస్ట్ వారెంట్లు జారీ చేసినట్లు గుర్లెక్ తెలిపారు. ఈ కేసును ఇస్తాంబుల్‌లోని 11వ హై క్రిమినల్ కోర్టు విచారిస్తోంది. మొత్తం 35 మంది నిందితులు ఈ కేసులో ఉన్నారు.
నెతన్యాహుపై ఏ ఆరోపణలు?
టర్కీ న్యాయశాఖ ప్రకారం.. నెతన్యాహు, మోస్కోవిచ్‌పై మారణహోమం, మానవత్వానికి వ్యతిరేక నేరాలు, తీవ్ర స్థాయిలో వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం, ఉద్దేశపూర్వకంగా గాయపరచడం, హింసించడం, ఆస్తుల ధ్వంసం, తీవ్రమైన దోపిడీ, రవాణా వాహనాలను హైజాక్ చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. అంతర్జాతీయ జలాల్లో గాజాకు మానవతా సాయం అందించేందుకు వెళ్తున్న పౌరులపై సాయుధ చర్యకు దిగడం, అనంతరం ఫ్లోటిల్లాలోని కార్యకర్తలను నిర్బంధించడం ఈ కేసుకు ప్రధాన ఆధారమని టర్కీ అధికారులు చెబుతున్నారు. ఈ కేసును దేశీయ, అంతర్జాతీయ న్యాయ మార్గాల్లో కొనసాగిస్తామని గుర్లెక్ తెలిపారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం మారణహోమం ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది. గాజాలో చేపట్టిన సైనిక చర్యలను సమర్థిస్తోంది.
గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా గాజాకు మానవతా సాయం అందించేందుకు చేపట్టిన అంతర్జాతీయ పౌరుల ప్రయత్నం. ఇందులో సుమారు 50 నౌకలు, వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. అంతర్జాతీయ జలాల్లో ఈ నౌకలను ఇజ్రాయెల్ దళాలు అడ్డుకుని, అందులో ఉన్న కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం వారిని ఇజ్రాయెల్‌కు తరలించి, తరువాత దేశం నుంచి బహిష్కరించారు. ఈ ఘటనపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తడంతో పాటు పలు దేశాల్లో న్యాయపరమైన చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. ఫ్లోటిల్లాను అడ్డుకోవడం, కార్యకర్తలను నిర్బంధించడంపైనే టర్కీ కేసు ప్రధానంగా దృష్టి సారించింది.
ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు అంటే?
ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు అంటే అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్ కాదు. ఒక వ్యక్తిని గుర్తించి, అప్పగింత లేదా ఇతర న్యాయ ప్రక్రియ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా అదుపులోకి తీసుకోవాలని ఇంటర్‌పోల్ సభ్య దేశాల పోలీసు సంస్థలకు చేసే అభ్యర్థన మాత్రమే. రెడ్ నోటీసు జారీ అయినంత మాత్రాన సంబంధిత దేశం ఆ వ్యక్తిని తప్పనిసరిగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి టర్కీ అభ్యర్థన ఆమోదమైనా.. నెతన్యాహు విదేశాలకు వెళ్లిన వెంటనే అరెస్ట్ అవుతారని చెప్పలేం.
పాత వివాదం
టర్కీ, ఇజ్రాయెల్ మధ్య గాజా ఫ్లోటిల్లాకు సంబంధించి గతంలోనూ తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. 2010లో గాజాకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఫ్లోటిల్లాలోని టర్కీ జెండా కలిగిన మావి మార్మారా నౌకపై ఇజ్రాయెల్ నౌకాదళ కమాండోలు దాడి చేశారు. ఈ ఘటనలో 10 మంది టర్కీ కార్యకర్తలు మరణించారు. దీంతో అంకారా, జెరూసలెం మధ్య తీవ్ర దౌత్య సంక్షోభం ఏర్పడింది. తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు కొంత మెరుగుపడినా.. 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసిన అనంతరం ప్రారంభమైన గాజా యుద్ధంతో సంబంధాలు మరోసారి తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఇజ్రాయెల్‌పై టర్కీ తీవ్ర విమర్శలు
టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందని పలుమార్లు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండిస్తోంది. అంకారా హమాస్‌తోనూ సంబంధాలు కొనసాగిస్తూ.. గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌తో వాణిజ్యాన్ని కూడా టర్కీ నిలిపివేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇజ్రాయెల్ మాత్రం అక్టోబర్ 7 దాడికి ప్రతిస్పందనగా హమాస్‌పై సైనిక చర్య చేపట్టామని చెబుతోంది. ఆ దాడిలో ఇజ్రాయెల్‌లో సుమారు 1,200 మంది మరణించగా.. పలువురిని హమాస్ బందీలుగా తీసుకెళ్లింది.
ఇప్పటికే న్యాయ చర్యలు
గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ చర్యలకు సంబంధించి నెతన్యాహు, ఇతర ఇజ్రాయెల్ అధికారులపై టర్కీ గతంలోనే న్యాయపరమైన చర్యలు ప్రారంభించింది. తాజాగా ఫ్లోటిల్లా కేసులో ఇస్తాంబుల్ కోర్టు జూలై 14న నెతన్యాహు, మోస్కోవిచ్‌పై అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ఇప్పుడు ఆ వారెంట్ల ఆధారంగా ఇంటర్‌పోల్ రెడ్ నోటీసులు కోరేందుకు టర్కీ ప్రయత్నిస్తోంది. దీంతో టర్కీ-ఇజ్రాయెల్ మధ్య ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్న సంబంధాల్లో మరో కీలక న్యాయ, దౌత్య వివాదం తెరపైకి వచ్చినట్లైంది.

