Turkey Earthquake: భూకంపంలో అల్లాడుతున్న టర్కీని మరోసారి భూకంపం భయపెట్టింది. రెండు వారాల క్రితం 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపాలకు టర్కీ, సిరియా దేశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే సోమవారం మరోసారి భూకంపం వచ్చింది. 6.4 తీవ్రతతో దక్షిణ టర్కీ నగరం అయిన అంటిక్యాలో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు సిరియా, లెబనాన్, ఈజిప్ట్ వరకు వెళ్లాయి. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతం అయినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది.
Read Also: Imran Khan : పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట.. హైకోర్టు బెయిల్ మంజూరు
తాజాగా వచ్చిన భూకంపంలో ముగ్గురు వ్యక్తులు మరణించడంతో పాటు 200 మందికి పైగా గాయపడినట్లు టర్కీ అంతర్గత మంత్రి సులేమాన్ సోయ్లు చెప్పారు. ఇప్పటికే టర్కీ, సిరియాల్లో 47,000 మందికి పైగా మరణించారు. ఒక్క టర్కీలోనే 41,156 మంది మరణించారు. 3,85,000 అపార్ట్మెంట్లు ధ్వంసం అయ్యాయి. భూకంపం బారిన పడిన టర్కీ, సిరియా దేశాలకు ప్రపంచ దేశాలు సహాయసహకారాలు అందిస్తున్నాయి. భారత్ ‘ఆపరేషన్ దోస్త్’ పేరుతో సహాయకార్యక్రమాల్లో పాల్గొంది.
దశాబ్ధాలుగా ఎప్పుడూ చూడని విధంగా టర్కీ భూకంపం సంభవించింది. వరసగా 7.8, 7.5, 6 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. 1000కి పైగా ప్రకంపనలు వచ్చాయి. భూకంపం ధాటికి టర్కీ 5-6 మీటర్లు పక్కకు జరిగింది. కొన్ని వందల కిలోమీటర్ల వరకు భూమి చీలిపోయింది.