అక్రమ వలసలపై ట్రంప్ పంతం వీడలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఇదే అంశంపై చర్యలను మరింత కఠినతరం చేస్తూ వైట్‌హౌస్ సంచలనాత్మక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. మొదట వీడియో చూసిన వారికి ఇది అంతరిక్ష జీవులు (Aliens) గురించి అనిపించినా.. అసలు విషయం మాత్రం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల గురించి అన్న విషయం అర్థమైపోతుంది.
Aliens.gov పేరుతో ప్రారంభించిన ఈ వెబ్‌సైట్ పూర్తిగా స్పేస్ థీమ్‌లో రూపొందించబడింది. ఇందులో “They Walk Among Us” (వాళ్లు మన మధ్యే తిరుగుతున్నారు) అనే భయానక గ్రీన్ టెక్స్ట్‌తో సందేశాలు కనిపిస్తున్నాయి. “60 ఏళ్లుగా అమెరికా ప్రభుత్వం ఒక రహస్యాన్ని దాచిపెట్టింది. ఏలియన్స్ మన మధ్యే నివసిస్తున్నారు. మన పక్కనే ఉంటున్నారు. మన రోజువారీ జీవితాల్లో కలిసిపోయారు. కానీ ఒక విషయం మాత్రం నిజం.. వాళ్లు ఇక్కడికి చెందిన వారు కాదు” అంటూ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
ఈ వెబ్‌సైట్‌లో అమెరికా మ్యాప్‌తో పాటు “Alien Arrests” పేరుతో అక్రమ వలసదారుల అరెస్టుల ట్రాకింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఈ డేటాను నిరంతరం అప్‌డేట్ చేస్తామని, వైట్‌హౌస్ యాప్‌లో కూడా అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు. అంతేకాకుండా.. “లక్షలాది మంది చీకటి కప్పులో అమెరికాలోకి వచ్చి సమాజంలో కలిసిపోయారు. అనేక మంది అధ్యక్షులు, కాంగ్రెస్ సభ్యులు, ఉన్నతాధికారులు ఈ విషయం తెలిసినా దాన్ని దాచిపెట్టారు” అంటూ వెబ్‌సైట్ ఆరోపించింది.
ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. “నిజం చెప్పే ధైర్యం చేసిన ఒక్క నాయకుడు ట్రంప్ మాత్రమే” అని పేర్కొన్నారు. అక్రమ వలసదారులు అమెరికాకు ముప్పుగా మారారని ట్రంప్ హెచ్చరించారని వెబ్‌సైట్‌లో తెలిపారు. “మీరు ఏదైనా Alien అపహరణను (abduction) గమనిస్తే భయపడవద్దు. ఆ Alien ఇప్పుడు సురక్షిత చేతుల్లో ఉంది. మేము దాన్ని దాని స్వదేశానికి తిరిగి పంపిస్తాం” అంటూ వెబ్‌సైట్ చివరిలో వ్యంగ్యంగా పేర్కొన్నారు. అలాగే “సందేహాస్పద ఏలియన్స్‌ను రిపోర్ట్ చేయండి” అంటూ ప్రత్యేక టిప్ బాక్స్‌ను కూడా ఏర్పాటు చేశారు.
ఇక అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జనవరి మధ్య నాటికి అమెరికాలోని ICE నిర్బంధ కేంద్రాల్లో దాదాపు 73 వేల మంది నిర్బంధంలో ఉన్నారు. అక్రమ వలసదారుల అరెస్టులు, బహిష్కరణలపై గత ఏడాది నుంచి అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. జనవరిలో మినియాపోలిస్‌లో జరిగిన ఆందోళనల సందర్భంగా రెనీ గుడ్, అలెక్స్ ప్రెట్టీ అనే ఇద్దరు నిరసనకారులు ICE ఏజెంట్ల కాల్పుల్లో మరణించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
They walk among us. https://t.co/7HysdUuNVM pic.twitter.com/PkUHcT7igg
— The White House (@WhiteHouse) May 28, 2026
