Donald Trump: ఆర్థిక సాయం బంద్.. ఇజ్రాయిల్‌కు ట్రంప్ షాక్!

  • ఇజ్రాయిల్‌కు షాక్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్..
  • ఆర్థిక సాయం నిలిపేస్తున్నట్లు ప్రకటన..
Trump Netanyahu

Trump Netanyahu

Donald Trump:  అమెరికా మిత్రదేశం ఇజ్రాయిల్‌కు షాక్ ఇవ్వబోతోంది. ఈ ఏడాది చివర నుంచి ఇజ్రాయిల్‌కు అందించే ఆర్థిక సాయాన్ని నిలిపేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ఈ మేరకు ఒప్పందం కుదిరినట్లు ఆయన చెప్పారు. అయితే, ఇజ్రాయిల్‌కు ఆయుధాల విక్రయాలు కొనసాగుతాయని, అవసరమైతే ఇతర సైనిక సహకారాన్ని కూడా అందిస్తున్నామని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రకటనతో దశాబ్ధాలగా కొనసాగుతున్న రెండు దేశాల సైనిక సంబంధాల్లో కీలక మార్పులు కనిపించే అవకాశం ఉంది.

అమెరికా మధ్యంతర ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఇజ్రాయెల్‌కు ఇకపై ఆర్థిక సాయం అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తోందంటూ డెమోక్రాట్లు రిపబ్లికన్లపై చేస్తున్న విమర్శలకు ఈ నిర్ణయం సమాధానంగా నిలుస్తుందని కూడా ట్రంప్‌ అన్నారు. జ్రాయెల్‌కు ఏటా 4 బిలియన్‌ డాలర్లు అందించే సాయాన్ని నిలిపివేయాలని కొన్ని నెలల క్రితమే నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే, ఇజ్రాయిల్‌కు అవసరమైనప్పుడు అమెరికా సాయం చేస్తుందని స్పష్టం చేశారు.

అమెరికాలో ఇజ్రాయిల్ మద్దతుపై వ్యతిరేకత..

గాజాపై ఇజ్రాయిల్ చేపట్టిన సైనిక చర్యల కారణంగా అమెరికాలోని ఓ వర్గంలో వ్యతిరేకత పెరుగుతోంది. ముఖ్యంగా డెమోక్రాట్లు ఆ దేశానికి అందిస్తున్న సహాయంపై ట్రంప్ పరిపాలనపై విమర్శలు చేస్తున్నారు. అమెరికా ఇజ్రాయిల్‌కు అవసరానికి మించి సహాయం చేస్తుందని భావిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. జూన్‌లో క్విన్నిపియాక్‌ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో 48 శాతం మంది అమెరికా ఓటర్లు, 66 శాతం మంది డెమోక్రాట్లు తమ దేశం ఇజ్రాయెల్‌కు అతిగా మద్దతు ఇస్తోందని అభిప్రాయపడ్డారు. 2017లో ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఈ సంఖ్యలు వరుసగా 16 శాతం, 20 శాతంగా ఉంది. మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభలపై రిపబ్లికన్లు పట్టు కోల్పోయే అవకాశం ఉన్న సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

నెతన్యాహూపై విమర్శలు..

ట్రంప్ ప్రకటనపై ఇజ్రాయిల్‌లో కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెతన్యాహూ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రయత్నిస్తున్న ప్రత్యర్థి రాజకీయ కూటమి నేత గాడి ఐసెన్‌కోట్ కూడా ఈ నిర్ణయాన్ని ప్రశ్నించారు. అమెరికాతో వ్యూహాత్మక సంబంధాల వ్యవస్థలో మార్పుల గురించి ఇజ్రాయిల్ భద్రతా వ్యవస్థతో పాటు ప్రజలు కూడా మీడియా ద్వారానే తెలుసుకోవాల్సి వస్తోందని, ఇది నెతన్యాహూ వ్యవహారశైలితోని సమస్యల్ని చూపుతోందని విమర్శించారు. ఇకపై నెతన్యాహూపై ఆధారపడలేమని, ఆయన స్థానంలో మరో నేత రావాలని పిలుపునిచ్చారు.