Trump: భారత్ ఎన్నికల వ్యవస్థ సూపర్.. ట్రంప్ ప్రశంసలే.. ప్రశంసలు

  • భారత్ ఎన్నికల వ్యవస్థపై ట్రంప్ ప్రశంసలు
  • ఎన్నికల వ్యవస్థ చాలా బాగుందని కితాబు
  • అమెరికాలో కూడా అమలు చేయాలని సూచనలు
Trump5

Trump5

భారత్ ఎన్నికల వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు కురిపించారు. భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ బాగుందని కితాబు ఇచ్చారు. ప్రతి ఓటరుకు ఫొటో ఐడీ ఉందంటూ కొనియాడారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్రంప్ పేర్కొన్నారు.

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో జరిగిన ఓ సంభాషణను ప్రస్తావించిన ట్రంప్.. అమెరికాలో తప్పనిసరి ఫొటో గుర్తింపు లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నారని ఆయన ప్రశ్నించినట్లు తెలిపారు. భారత్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 64.6 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారని ట్రంప్ పేర్కొన్నారు. వారిలో 1 శాతం కంటే తక్కువ మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికాలో కూడా ఓటర్ గుర్తింపు నిబంధనలను మరింత కఠినతరం చేయాలని పిలుపునిస్తూ.. ‘SAVE America Act’ను కాంగ్రెస్ ఆమోదించాలని కోరారు. ఈ మేరకు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్టు చేశారు.

భారత్‌లో ప్రతి ఓటరు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు పత్రాన్ని చూపించాల్సి ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో కూడా ఓటర్ల గుర్తింపు, పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

వైట్ హౌస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. SAVE America Act ద్వారా ఫెడరల్ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకునే సమయంలో చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రంతో పాటు అమెరికా పౌరసత్వానికి సంబంధించిన ఆధారాలను సమర్పించడం తప్పనిసరి చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే పోస్టల్ ఓటింగ్‌ను కొన్ని నిర్దిష్ట పరిస్థితులకు మాత్రమే పరిమితం చేయడం, ఫెడరల్ ఓటర్ జాబితాల నుంచి అమెరికా పౌరులు కాని వ్యక్తుల పేర్లను తొలగించేందుకు రాష్ట్రాలను ఆదేశించే నిబంధనలు కూడా ఈ చట్టంలో ఉన్నట్లు వైట్ హౌస్ తెలిపింది.

భారత్, బ్రెజిల్‌తో పోలిక

అమెరికా ఎన్నికల విధానాన్ని భారత్, బ్రెజిల్‌తో పోలుస్తూ ట్రంప్ ప్రభుత్వం వ్యాఖ్యలు చేస్తోంది. భారత్, బ్రెజిల్‌లో బయోమెట్రిక్ ఆధారిత ఓటర్ గుర్తింపు వ్యవస్థలు ఉన్నాయని, అమెరికాలోనూ ఎన్నికల ప్రక్రియలో ఓటర్ గుర్తింపు, పౌరసత్వ ధృవీకరణను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని పరిపాలన వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ భారత్ ఎన్నికల విధానాన్ని ప్రస్తావించడం, SAVE America Actను త్వరగా ఆమోదించాలని కోరడం అమెరికాలో ఎన్నికల సంస్కరణలపై కొనసాగుతున్న రాజకీయ చర్చకు మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది.

ట్రంప్ ఇలా రాశారు..

ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో.. ‘‘ఈ నెల ప్రారంభంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మా ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న అడిగారు. చెల్లుబాటు అయ్యే ఫొటో ఐడీ లేకుండా అమెరికాలో మీరు ఎన్నికలను ఎలా నిర్వహించగలరు?’’ అని పేర్కొన్నారు. భారత్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 64.6 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారని ట్రంప్ తెలిపారు. వారిలో 1 శాతం కంటే తక్కువ మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారని పేర్కొన్నారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు పత్రాన్ని కలిగి ఉండాల్సి వచ్చిందని అన్నారు.