Site icon NTV Telugu

US Tariff: భారతదేశంపై 25 శాతం ట్యాక్స్‌ ఎత్తివేయడానికి సిద్ధమైన ట్రంప్..? అమెరికా ట్రెజరీ కార్యదర్శి కీలక ప్రకటన..

Donald

Donald

US Tariff: భారతదేశంపై అమెరికా విధించిన 25 శాతం సుంకాన్ని (టారిఫ్) భవిష్యత్తులో ఎత్తివేసే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సుంకం అమెరికాకు “చాలా విజయవంతమైందని” పేర్కొన్న ఆయన, పరిస్థితులు అనుకూలిస్తే దీనిని తొలగించే మార్గం ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రకటన అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

25 శాతం సుంకం వల్ల రష్యా చమురు కొనుగోళ్లు తగ్గాయన్న అమెరికా
స్కాట్ బెస్సెంట్ ప్రకారం, భారతదేశంపై 25 శాతం సుంకం విధించిన తర్వాత రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసే చమురు గణనీయంగా తగ్గింది. ఈ కారణంగానే ఈ సుంకాన్ని అమెరికా విజయవంతమైన చర్యగా భావిస్తోందని తెలిపారు. అయితే, ప్రస్తుతం అమలులో ఉన్న ఈ ట్యారిఫ్‌ను శాశ్వతంగా కొనసాగించాలనే ఉద్దేశం అమెరికాకు లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే, “ఇప్పుడే ఈ సుంకాన్ని తొలగించడానికి ఒక మార్గం ఉందని నేను భావిస్తున్నాను” అని బెస్సెంట్ చేసిన వ్యాఖ్యలు, భారత్–అమెరికా మధ్య చర్చలు పురోగమిస్తే 25 శాతం టారిఫ్ కు ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయన్న సంకేతంగా భావిస్తున్నారు. ముఖ్యంగా రష్యాపై ఆంక్షలు, చమురు వ్యాపారం అంశాలపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

భారతదేశంపై అమెరికా ఎంత సుంకం విధిస్తోంది?
ప్రస్తుతం అమెరికా, భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే అనేక ఉత్పత్తులపై మొత్తంగా 50 శాతం వరకు సుంకాలు విధిస్తోంది. ఇందులో.. సుమారు 25 శాతం సాధారణ సుంకం (భారత ఎగుమతుల్లో దాదాపు 55 శాతంపై ప్రభావం).. ఆగస్టు 2025 నుంచి అమల్లోకి వచ్చిన వచ్చింది 25 శాతం అదనపు ‘చమురు సంబంధిత జరిమానా సుంకం’.. ఈ అదనపు సుంకం ద్వారా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించాలని అమెరికా ఒత్తిడి తీసుకొస్తోంది.. రష్యా చమురుపై అమెరికా, G7 దేశాలు, యూరోపియన్ యూనియన్ కలిసి ధరల పరిమితి విధానాన్ని అమలు చేస్తున్నాయి. జనవరి 2026 వరకు బ్యారెల్‌కు సుమారు $47.60 ఉండగా.. ఫిబ్రవరి 1, 2026 నుంచి $44.10కి తగ్గించారు.. నిర్దేశిత ధర కంటే ఎక్కువకు రష్యన్ చమురును విక్రయిస్తే, బీమా, షిప్పింగ్, ఫైనాన్సింగ్ సేవలు అందించరాదనే నిబంధనలు ఉన్నాయి.

500 శాతం సుంకాల బిల్లు, భారత నిర్ణయాలు
ఈ ఒత్తిడుల నేపథ్యంలో భారత్, రష్యన్ చమురు కొనుగోళ్లను తగ్గించిందని అమెరికా చెబుతోంది. రిలయన్స్ వంటి ప్రధాన భారతీయ రిఫైనరీలు జనవరి 2026లో రష్యన్ చమురు కొనుగోళ్లను నిలిపివేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, భారత్ తన జాతీయ ప్రయోజనాలు, సరసమైన ధరల ఆధారంగానే ఇంధన కొనుగోళ్ల నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేస్తోంది. అదే సమయంలో అమెరికాలో ప్రతిపాదిత 500% సుంకాల బిల్లును భారత్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.. అయితే, భారతదేశంపై 25 శాతం సుంకం ఎత్తివేత జరిగితే, రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. అయితే, ఇది పూర్తిగా భవిష్యత్ చర్చలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version