Trump: వెనిజులా దేశంపై దాడి చేసి, ఆ దేశాధ్యక్షుడి నికోలస్ మదురోను అమెరికా అరెస్ట్ చేసింది. అతడిపై నార్కో-టెర్రరిజం కేసుల్ని మోపింది. ఈ నేపథ్యంలో మరో దేశానికి యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికాతో వెంటనే ఒప్పందం చేసుకోవాలని మరో లాటిన్ అమెరికన్ దేశం క్యూబాను హెచ్చరించారు. లేకపోతే క్యూబాకు ఇకపై చమురు, ఆర్థిక సాయం ఉండదని హెచ్చరించారు. ‘‘క్యూబాకు ఇకపై చమురు, డబ్బులు ఉండవు. ఇంకా ఆలస్యం చేయకుండా అమెరికాతో వారు ఒప్పందం చేసుకోవాలని సూచిస్తున్నాను’’ అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ లో రాశారు.
Read Also: Meenakshi Chaudhary: నేను డ్యాన్స్ చేయడానికి సిగ్గుపడుతుంటాను: మీనాక్షి చౌదరి
క్యూబా అనేక సంవత్సరాలుగా వెనిజులా నుంచి భారీగా చమురు, డబ్బుపై ఆధారపడి జీవిస్తోందని ట్రంప్ ఆరోపించారు. క్యూబా రాజధాని హవానాలోని అమెరికా రాయబార కార్యాలయం ముందు వేలాది మందితో కలిసి ఆ దేశ అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్ కానెల్ శనివారం ర్యాలీ నిర్వహించారు. అమెరికా తీరును ఖండించారు. వెనిజులాపై దాడిని ఉగ్రవాదంగా అభివర్ణించారు. క్యూబాకు అవసరమైన చమురులో 30 శాతాన్ని వెనిజులా సరఫరా చేస్తోంది. దీనికి ప్రతిఫలంగా క్యూబా వెనిజులాకు వేలాది మంది వైద్య సిబ్బందిని అందిస్తోంది. ఒక వేళ వెనిజులా నుంచి క్యూబాకు ఆయిల్ దిగుమతులు నిలిచిపోతే, క్యూబా విద్యుత్ గ్రిడ్ దెబ్బతినే అవకాశం ఉంది.
