Donald Trump: హమాస్ ఉగ్రవాదులతో ఇజ్రాయిల్ కాల్పుల విరమణకు అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. గాజాలో 60 రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు వెల్లడించారు. దీని కోసం ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహించారని చెప్పుకొచ్చారు. తన ప్రతినిధులు గాజా గురించి ఇజ్రాయిల్ అధికారులతో సుదీర్ఘమైన, ఫలవంతమైన సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు.
60 రోజుల కాల్పుల విరమణను ఖరారు చేయడానికి ఇజ్రాయెల్ షరతులకు అంగీకరించిందని,‘‘ఈ సమయంలో మేము యుద్ధాన్ని ముగించడానికి అన్ని పార్టీలతో కలిసి పని చేస్తాము’’ అని ట్రంప్ అన్నారు. ఖతార్, ఈజిప్ట్ ప్రతినిధులు హమాస్‌కు “ఈ తుది ప్రతిపాదన”ను అందజేస్తారని ట్రంప్ అన్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల కోసం హమాస్ ఈ ఒప్పందాన్ని ఒప్పుకుంటుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ఒక వేళ హమాస్ అంగీకరించకుంటే వారి పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు.
Read Also: IndiGo Flight Emergency Landing: ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్.. 222 మంది ప్రయాణికులు సేఫ్..
ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ, ఇజ్రాయిల్ గాజాలోని హమాస్ ఉగ్రవాదుల మధ్య వచ్చే వారం బందీల కోసం కాల్పుల విరమణ ఒప్పందం కుదురే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు, సోమవారం ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, వైట్‌హౌజ్‌లో ట్రంప్‌ని కలవనున్నారు. యుద్ధాన్ని ముగించడానికి ఏదైనా ఒప్పందం ప్రకారం గాజాలో మిగిలిన బందీలను విడిపించడానికి సిద్ధంగా ఉన్నామని హమాస్ తెలిపింది. హమాస్ పూర్తిగా తమ ఆయుధాలను విడిచిపెడితేనే అది సాధ్యమవుతుందని ఇజ్రాయిల్ ఇటీవల చెప్పింది. హమాస్ మాత్రం నిరాయుధీకరణకు నిరాకరించింది.
అక్టోబర్, 2023న ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి చేసి 1200 మందిని చంపింది. 251మందిని బందీలుగా గాజాలోకి తీసుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాపై దాడి చేస్తోంది. హమాస్ చెబుతున్న దాని ప్రకారం, ఇజ్రాయిల్ దాడుల్లో ఇప్పటి వరకు 56,000 మంది పాలస్తీనియన్లు మరణించారు.
