Trump: అణు తనిఖీలు, హార్ముజ్‌పై ట్రంప్ కీలక ప్రకటన.. వెంటనే ఖండించిన ఇరాన్

  • అణు తనిఖీలు, హార్ముజ్‌పై ట్రంప్ కీలక ప్రకటన
  • వెంటనే ఖండించిన ఇరాన్
  • తదుపరి చర్చలపై ప్రతిష్టంభన
Trump

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌తో జరుగుతున్న చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తన అణు కార్యక్రమంపై దీర్ఘకాలిక, అత్యున్నత స్థాయి తనిఖీలకు అంగీకరించిందని ప్రకటించారు. అలాగే ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని తెరిచే ఉంచేందుకు కూడా తాము అంగీకరించామని తెలిపారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను వెంటనే ఇరాన్ ఖండించింది.

సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ట్రంప్ చేసిన పోస్టులో.. “ఇరాన్ భవిష్యత్తులో నిరంతర అణు తనిఖీలకు పూర్తిగా అంగీకరించింది. ఇది అణు పారదర్శకతను నిర్ధారిస్తుంది. ఈ విషయంపై అంగీకారం లేకపోతే తదుపరి చర్చలే జరిగేవి కావు” అని పేర్కొన్నారు. ఇరాన్ నుంచి అనేక కీలక రాయితీలు లభించాయని చెబుతూ.. హార్ముజ్ జలసంధిపై విధించాలనుకున్న నౌకాదళ దిగ్బంధన చర్యలను ప్రస్తుతం నిలిపివేస్తున్నామని ట్రంప్ వెల్లడించారు. హోర్ముజ్ జలసంధి తెరిచే ఉంటుందని… అయితే అవసరమైతే మళ్లీ దిగ్బంధనాన్ని అమలు చేసేందుకు మా నౌకాదళ బలగాలు సిద్ధంగానే ఉంటాయని తెలిపారు.

×
×
Ad

ఇరాన్ కౌంటర్

అయితే ట్రంప్ చేసిన ప్రకటనలను ఇరాన్ విదేశాంగ శాఖ ఖండించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో దెబ్బతిన్న తమ అణు కేంద్రాలను పరిశీలించేందుకు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA)కి అనుమతి ఇవ్వలేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ స్పష్టం చేశారు. “ఐఏఈఏ డైరెక్టర్ జనరల్‌తో ఎలాంటి సమావేశం జరగలేదు. దెబ్బతిన్న అణు కేంద్రాల తనిఖీలకు అనుమతి ఇచ్చే ప్రణాళిక కూడా ప్రస్తుతం లేదు” అని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అలీ బహ్రెయిని కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు.

ఇరాన్‌కు ఇవ్వబోయే ఆర్థిక సడలింపులపై కూడా ట్రంప్ స్పష్టత ఇచ్చారు. అమెరికా విడుదల చేసే నిధులు లేదా ఆంక్షల సడలింపుల ద్వారా లభించే డబ్బు మొత్తం అమెరికా నియంత్రణలోని ఎస్క్రో ఖాతాల్లోనే ఉంటుందని చెప్పారు. ఆ నిధులను కేవలం ఆహారం, ఔషధాల కొనుగోలుకు మాత్రమే వినియోగించుకునేలా అనుమతిస్తామని తెలిపారు. ముఖ్యంగా అమెరికా రైతులు ఉత్పత్తి చేసే మొక్కజొన్న, గోధుమలు, సోయాబీన్స్ వంటి వస్తువుల కొనుగోలుకు ఆ నిధులను ఉపయోగించవచ్చని పేర్కొన్నారు. ఇరాన్ ప్రస్తుతం మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని.. అక్కడ ప్రజలకు అత్యవసరంగా ఆహారం, వైద్య సరఫరాలు అవసరం. అందుకే సహాయం చేయడం అవసరమని భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.

ఇక అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల స్విట్జర్లాండ్‌లో తొలి విడత చర్చలు జరిగాయి. రెండు దేశాలు 60 రోజుల్లో తుది ఒప్పందం కుదుర్చుకునే లక్ష్యంతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. అణు కార్యక్రమం, ఆంక్షల సడలింపు, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. అయితే అణు తనిఖీలు, హార్ముజ్ జలసంధి భవిష్యత్తు, ఇరాన్‌కు సంబంధించిన స్తంభింపజేసిన ఆస్తుల విడుదల వంటి అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవైపు ట్రంప్ చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని చెబుతుండగా.. మరోవైపు ఇరాన్ మాత్రం కొన్ని కీలక అంశాలపై భిన్నమైన వైఖరి వ్యక్తం చేస్తుండటంతో తుది ఒప్పందంపై ఆసక్తి నెలకొంది.