Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అదనంగా టారిఫ్‌లు విధించే అవకాశం లేకపోవచ్చని సంకేతాలు ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన కీలక సమావేశం అనంతరం మీడియా సమావేశంలో అతడు ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అదనపు సుంకాల విషయంలో మరో రెండు మూడు వారాల్లో పునరాలోచన చేస్తాను అని పేర్కొన్నారు.
అయితే, భారత్‌పై దృష్టి సారిస్తూ, రష్యా తన చమురు క్లయింట్‌ను కోల్పోయిందని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి భారత్, చైనా లాంటి దేశాలపై అదనపు టారిఫ్‌లు విధించే ఉద్దేశం లేదని వెల్లడించారు. కాగా, ఇటీవల భారత్‌పై 25 శాతం అదనపు టారీఫ్స్ విధిస్తున్నట్లు యూఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కొత్త సుంకాలు ఆగస్టు 27వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.
