Trump Hair: హెయిర్‌స్టైల్ మార్చేసిన ట్రంప్.. నెటిజన్లు కామెంట్లు

  • ట్రంప్ జుట్టులో ఊహించని మార్పు
  • నల్లగా మారిన హెయిర్
  • సోషల్ మీడియాలో ట్రోల్స్, జోక్స్!
Trump2

Trump2

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెయిర్ స్టైల్ మార్చేశారు. కొత్త లుక్‌తో అలరిస్తున్నారు. ఎప్పుడూ తెల్ల జుట్టుతో కనిపించే ట్రంప్.. ఇప్పుడు హెయిర్‌ నల్లగా మారిపోయింది. 80 ఏళ్ల వయసులో ఉన్న ట్రంప్.. ఇప్పుడు యంగ్‌లా మారేందుకు ప్రయత్నించడంతో సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

న్యూజెర్సీ పర్యటనలో ట్రంప్ తాజా ఫొటోల్లో సాధారణంగా కనిపించే బంగారు రంగు జుట్టుకు బదులుగా.. మరింత ముదురు, దాదాపు బ్రౌన్ రంగులో కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో ట్రంప్ కొత్త లుక్‌పై జోకులు, కామెంట్లు, ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే ఇటీవలే ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. తాను విగ్ ధరించనని స్పష్టం చేశారు. ఇలాంటి తరుణంలో తాజా ఫొటోలు మరోసారి ఆయన హెయిర్‌స్టైల్‌పై చర్చకు దారితీశాయి.

ట్రంప్ జుట్టులో ఏం మారింది?

సెప్టెంబర్ 4, శుక్రవారం న్యూజెర్సీలోని మోరిస్‌టౌన్ మున్సిపల్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి ట్రంప్ దిగారు. వారాంతంలో ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్ బెడ్‌మినిస్టర్‌కు వెళ్లే ముందు ఆయన అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోల్లో ట్రంప్ జుట్టు సాధారణంగా కనిపించే గోల్డెన్-బ్లాండ్ రంగుకు భిన్నంగా.. చాలా ముదురు రంగులో దాదాపు బ్రూనెట్‌లా కనిపించింది. విమానం నుంచి దిగి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో తీసిన చిత్రాల్లో ఈ తేడా స్పష్టంగా కనిపించింది.

జోకులు, కామెంట్లు

ట్రంప్ జుట్టు రంగులో కనిపించిన మార్పు వెంటనే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కొన్ని రోజుల క్రితం ట్రంప్ తాను విగ్ పెట్టుకోనని చెప్పిన నేపథ్యంలో ఈ చర్చ మరింత పెరిగింది.

అయితే తాజా ఫొటోలు బయటకు రావడంతో నెటిజన్లు మరోసారి ట్రంప్ హెయిర్‌పై కామెంట్లు చేశారు. ఓ వ్యక్తి.. తానే గెట్టి ఇమేజెస్ నుంచి ఫొటోలు తీసుకోకపోతే ఈ మార్పును నమ్మేవాడిని కాదని వ్యాఖ్యానించారు. జియోపార్డీ ఛాంపియన్ హేమంత్ మెహతా కూడా సరదాగా స్పందిస్తూ.. ట్రంప్ జుట్టుపై ‘హెల్ టూపీ’ అంటూ జోక్ చేశారు. మరో నెటిజన్ ట్రంప్ జుట్టును ఉద్దేశించి.. 80 ఏళ్ల వయసులో తెల్ల జుట్టును దాచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉందని కామెంట్ చేయగా.. ఇంకొకరు “కొత్త విగ్ పెట్టుకున్నారా?” అని ప్రశ్నించారు. మరికొందరు మాత్రం ఇది సీజన్‌కు సంబంధించిన మార్పు కావచ్చని అభిప్రాయపడ్డారు. వేసవి ముగియబోతున్న నేపథ్యంలో గోల్డెన్ బ్లాండ్ నుంచి బ్రూనెట్ రంగుకు మారడం సహజమేనంటూ ఓ నెటిజన్ సరదాగా వ్యాఖ్యానించారు. రచయిత అన్నీ లామాట్ కూడా ట్రంప్ కొత్త లుక్‌పై స్పందిస్తూ.. ఈ లుక్ యవ్వనంగా కనిపిస్తోందని, నటుడు పియర్స్ బ్రాస్నన్‌ను గుర్తుకు తెస్తోందని పేర్కొన్నారు.

గోల్ఫ్‌కు వెళ్లిన ట్రంప్..

తర్వాతి రోజు ట్రంప్ ఫాక్స్ న్యూస్ యాంకర్ బ్రెట్ బేయర్ తదితరులతో కలిసి గోల్ఫ్ ఆడుతూ కనిపించారు. అయితే ఆ సమయంలో ఆయన “Trump was right about everything” అనే వాక్యం ఉన్న ఎరుపు రంగు క్యాప్ ధరించారు. దీంతో ఆయన జుట్టులో ఎక్కువ భాగం క్యాప్‌తో కప్పబడి ఉంది. దీంతో న్యూజెర్సీలో కనిపించిన ముదురు రంగు నిజంగా హెయిర్‌స్టైల్‌లో మార్పా? లేక ఆ రోజు లైటింగ్, ఫొటో తీసిన పరిస్థితుల వల్ల అలా కనిపించిందా? అనే విషయం స్పష్టంగా తెలియలేదు. ఈ మార్పు ఇకపై ట్రంప్ కొత్త శాశ్వత లుక్‌గా కొనసాగుతుందా లేదా అనేది కూడా చెప్పలేని పరిస్థితి.

గతంలోనూ హెయిర్‌స్టైల్ మార్చిన ట్రంప్

ట్రంప్ తన ప్రత్యేకమైన హెయిర్‌స్టైల్‌లో అప్పుడప్పుడు మార్పులు చేస్తుంటారు. 2019లో వర్జీనియాలోని ఓ చర్చిలో జరిగిన కార్యక్రమానికి ట్రంప్ స్లిక్-బ్యాక్ హెయిర్‌స్టైల్‌తో హాజరయ్యారు. ఆ లుక్ కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ హెయిర్‌స్టైల్‌ను పోలి ఉందంటూ అప్పట్లో చర్చ జరిగింది. అయితే ఆ మార్పు ఎక్కువ కాలం కొనసాగలేదు. అదే రోజు తర్వాత ట్రంప్ మళ్లీ తన సాధారణ హెయిర్‌స్టైల్‌తో కనిపించారు. ట్రంప్ జుట్టుపై విగ్ ధరిస్తారా? హెయిర్‌పీస్ ఉపయోగిస్తారా? లేదా స్కాల్ప్‌కు సంబంధించిన ఏవైనా చికిత్సలు చేయించుకున్నారా? అనే ఊహాగానాలు కూడా చాలాకాలంగా ఉన్నాయి. విగ్ ధరిస్తారా అనే ప్రశ్నకు ట్రంప్ అప్పుడే సమాధానం ఇచ్చారు. ట్రంప్ తన జుట్టు నిజమైనదేనని చూపించేందుకు గతంలోనే బహిరంగంగా ప్రయత్నించారు.

2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ప్రముఖ టీవీ షో The Tonight Show with Jimmy Fallonలో పాల్గొన్న ట్రంప్.. షో హోస్ట్ జిమ్మీ ఫాలన్ తన జుట్టును ప్రేక్షకుల ముందే చెదరగొట్టేందుకు అనుమతించారు. తాను విగ్ ధరించడం లేదని చూపించేందుకే అలా చేశారు. అయితే దాదాపు దశాబ్దం తర్వాత.. ట్రంప్ జుట్టు మరోసారి సోషల్ మీడియా, ప్రజల దృష్టిని ఆకర్షించింది. న్యూజెర్సీలో కనిపించిన ముదురు రంగు జుట్టు ఉద్దేశపూర్వకంగా చేసిన మార్పా, తాత్కాలికమా, లేక లైటింగ్ కారణంగా అలా కనిపించిందా అన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు.