Trump-Netanyahu: ట్రంప్‌నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!

  • అక్టోబర్ 27న ఇజ్రాయెల్ ఎన్నికలు
  • ట్రంప్‌నకు నెతన్యాహు షాక్
  • కీలక ప్రతిపాదన తిరస్కరణ!
Trump

Trump

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు షాకిచ్చారు. గాజా కోసం అమెరికా మద్దతుతో రూపొందించిన ప్రణాళికకు ఇజ్రాయెల్ తిరస్కరించింది. అమెరికా ప్రతిపాదనను అంగీకరించలేదని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్ పూర్తిగా నిరాయుధీకరణకు అంగీకరించిన తర్వాతే గాజాలో ప్రస్తుతం ఉన్న ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లేలా హామీలు ఇచ్చినప్పటికీ.. ఈ ప్రణాళికపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.

మంగళవారం రాత్రి తన సోషల్ మీడియా ఖాతాల్లో విడుదల చేసిన వీడియోలో నెతన్యాహు ఈ అంశంపై స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బృందం.. హమాస్‌ను నిరాయుధీకరించడం, గాజాను సైనిక రహిత ప్రాంతంగా మార్చడం సాధ్యమవుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘ఈ ప్రణాళికను మేం పరిశీలిస్తున్నాం. వారు మాకు ఒక ముసాయిదాను పంపారు. అయితే దానికి మేం అంగీకరించలేదు. అది మా ముసాయిదా కాదు. మా అభిప్రాయాలు, సూచనలను వారికి పంపించాం’’ అని నెతన్యాహు స్పష్టం చేశారు.

అమెరికా మద్దతుతో ఏర్పాటైన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ప్రతినిధులతో నెతన్యాహూ సోమవారం సమావేశమయ్యారు. హమాస్ నిరాయుధీకరణ పూర్తయిన తర్వాతే గాజాలో ప్రస్తుతం ఇజ్రాయెల్ సైన్యం ఉన్న ప్రాంతాల నుంచి ఉపసంహరణ చేపట్టాల్సి ఉంటుందని ఈ సమావేశంలో హామీలు లభించినట్లు సమాచారం. అయితే ఈ ఒప్పందాన్ని తిరస్కరించాలంటూ నెతన్యాహుపై ఆయన పాలక కూటమిలోని అతివాద కుడిపక్ష వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ ప్రణాళికపై మరోసారి ఓటింగ్ నిర్వహించాలని ఇద్దరు అతివాద మంత్రులు మంగళవారం డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రతిపాదన తొలుత చర్చించిన అంశాలకు అనుగుణంగా లేదని వారు అభిప్రాయపడ్డారు. ఈ ఇద్దరు మంత్రులు సభ్యులుగా ఉన్న ఇజ్రాయెల్ భద్రతా కేబినెట్ ఇప్పటికే ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ ప్రణాళికలో భాగంగా గాజా స్ట్రిప్‌లో అంతర్జాతీయ శాంతి పరిరక్షక దళాలను మోహరించే అంశం కూడా ఉన్నట్లు సమాచారం.

మంగళవారం భద్రతా కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని నెతన్యాహూ భావించినప్పటికీ.. ఆ సమావేశం గురువారానికి వాయిదా పడినట్లు ఇజ్రాయెల్ మీడియా నివేదించింది. అక్టోబర్ 27న జరగనున్న ఎన్నికలకు ముందు నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీలో ప్రాథమిక ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో నెతన్యాహుకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్, సెటిల్మెంట్స్ మంత్రి ఒరిట్ స్ట్రూక్ మరోసారి ఓటింగ్ నిర్వహించాలని కోరడాన్ని కేవలం ఎన్నికల ప్రచార వ్యూహంగా చూడాలని ఇజ్రాయెల్‌కు చెందిన ‘మొలాద్’ థింక్‌ట్యాంక్ పరిశోధకుడు టాల్ ఎలోవిట్స్ అభిప్రాయపడ్డారు. నెతన్యాహుపై ఒత్తిడి పెంచేందుకే ఈ డిమాండ్ చేశారని పేర్కొన్నారు.

‘‘ఈ వివాదం అంతర్జాతీయ స్థాయికి వెళ్లే పరిస్థితిని ఇజ్రాయెల్ కుడిపక్షం ఎప్పటి నుంచో వాయిదా వేయాలని ప్రయత్నిస్తోంది. కొసోవో, ఇండోనేషియా వంటి దేశాల సైనికులు గాజాలో మోహరించిన తర్వాత ఇజ్రాయెల్ సైన్యం వ్యవహరించే తీరు భిన్నంగా ఉండే అవకాశం ఉంది’’ అని ఎలోవిట్స్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వేదికపై ఇజ్రాయెల్ ఒంటరిగా మారుతున్న నేపథ్యంలో.. అమెరికా మద్దతుతో రూపొందించిన ఈ ప్రణాళికను పూర్తిగా తిరస్కరించే అవకాశం ఇజ్రాయెల్‌కు లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దౌత్య ప్రపంచంలో ఇజ్రాయెల్‌కు మిగిలిన ప్రధాన మిత్రుడు అమెరికానేనని, అందువల్ల ట్రంప్ సూచనలను నెతన్యాహు పరిగణనలోకి తీసుకోక తప్పదని పేర్కొన్నారు.

‘‘ఈ వ్యవహారంలో నెతన్యాహూ ప్రధాన పాత్ర పోషించడం లేదు. కొన్ని ప్రతిపాదనలను అడ్డుకునేందుకు ప్రయత్నించడం వరకు ఆయన పాత్ర పరిమితమై ఉండొచ్చు. కానీ ఇజ్రాయెల్ కొత్త ప్రతిపాదనలను ముందుకు తీసుకురావడం లేదు’’ అని ఎలోవిట్స్ అన్నారు.

ఇదిలా ఉండగా.. గాజాపై దాడులను తగ్గించాలని ఇజ్రాయెల్‌పై అమెరికా చేస్తున్న ఒత్తిడి ఫలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా ఇజ్రాయెల్ సైన్యం పాక్షికంగా వెనక్కి తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో.. గాజాలో సైనిక చర్యలను నియంత్రించాలంటూ అమెరికా ఒత్తిడి పెంచినట్లు సమాచారం. ఇజ్రాయెల్ మీడియా కథనాల ప్రకారం.. సైనికులు గాజాలో దాడులు నిర్వహించాలంటే సాధారణ పరిస్థితుల్లో సైన్యాధిపతి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని కొత్త ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. సైనికులకు తక్షణ ప్రమాదం ఎదురైతే మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని సమాచారం. గతంలో ప్రాంతీయ కమాండ్ అధిపతి అనుమతితో దాడులు నిర్వహించే అవకాశం ఉండగా.. ఇప్పుడు అనుమతి ప్రక్రియను మరింత కఠినతరం చేసినట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాలపై స్పందించాలంటూ ప్రశ్నించగా.. ఇజ్రాయెల్ సైన్యం రాజకీయ నాయకత్వాన్ని సంప్రదించాలని సూచించింది. నెతన్యాహు కార్యాలయ ప్రతినిధి మాత్రం ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.