Trump: నోబెల్ గౌరవాన్ని తగ్గించారు.. నవీ పిళ్లైకు శాంతి బహుమతి ఇవ్వడంపై ట్రంప్ ఆక్షేపణ

  • నోబెల్ గౌరవాన్ని తగ్గించారు
  • అమెరికా, ఇజ్రాయెల్‌ను ద్వేషించేవారికి అవార్డా?
  • నవీ పిళ్లైకు శాంతి బహుమతి ఇవ్వడంపై ట్రంప్ ఆక్షేపణ
Trump

Trump

ఈ ఏడాది కూడా నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత సంతతి వ్యక్తి, దక్షిణాఫ్రికాకు చెందిన న్యాయవాది, ఐక్యరాజ్యసమితి మాజీ ఉన్నతాధికారి నవీ పిళ్లేకు శాంతి పురస్కారం ఇవ్వడాన్ని తప్పుబట్టారు. అమెరికా, ఇజ్రాయెల్‌ను నిస్సిగ్గుగా ద్వేషించే వ్యక్తికి అవార్డు ఇవ్వడం ద్వారా నోబెల్ కమిటీ ఒకప్పుడు గొప్పగా పేరొందిన శాంతి బహుమతి గౌరవాన్ని దిగజార్చిందని.. అవమానించిందని విమర్శించారు. నవీ పిళ్లై ఉగ్రవాదులను కీర్తిస్తూ.. హమాస్‌కు బహుమతులు ఇచ్చిందన్నారు. శాంతిని పెంపొందించడానికి ఆమె ఏం చేసిందని అవార్డ్ ప్రకటించారని నిలదీశారు. అయినా ఒకప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన శాంతి బహుమతిని యాసర్ అరాఫత్‌కు ఇచ్చిన కమిటీ నుంచి ఇంకేం ఆశించగలంలే? అంటూ ప్రశ్నించారు.

ట్రంప్ అనే వ్యక్తి ప్రపంచం అసాధ్యం అనుకున్న అబ్రహం ఒప్పందాలను విస్తరింపజేశారని.. ఇక హమాస్ చెరలో ఉన్న బందీలను స్వదేశానికి తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఇక రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగించడానికి ప్రయత్నించారని.. అలాగే అంతర్జాతీయ ఉగ్రవాదానికి ప్రధాన స్పాన్సర్ అయిన ఇరాన్‌ను అడ్డుకోవడానికి శయశక్తులా ప్రయత్నించినట్లుగా తెలిపారు. ఇలాంటి విషయాల్లో సత్కరించడానికి నోబెల్ శాంతి బహుమతి ఉందని ట్రంప్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

ట్రంప్ ఆరోపణలు

నవీ పిళ్లే అమెరికా, ఇజ్రాయెల్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తారని ట్రంప్ వ్యాఖ్యానించారు. గాజాపై కమిషన్ నిర్వహించిన దర్యాప్తును ‘బూటకపు విచారణ’గా అభివర్ణిస్తూ.. ఇజ్రాయెల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారని ఆరోపించారు. శాంతిని నెలకొల్పేందుకు ఆమె ఎలాంటి కృషి చేయలేదని కూడా విమర్శించారు. గతంలో పాలస్తీనా నాయకుడు యాసర్ అరాఫత్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడాన్ని కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఇలాంటి వ్యక్తులను ఎంపిక చేయడం ద్వారా నోబెల్ కమిటీ తన నిర్ణయాలపై ప్రశ్నలు తలెత్తేలా చేసిందని అభిప్రాయపడ్డారు.

నోబెల్ శాంతి బహుమతికి తాను మరింత అర్హుడినని ట్రంప్ తన ప్రకటనలో వాదించారు. ఇజ్రాయెల్, కొన్ని అరబ్ దేశాల మధ్య సంబంధాల సాధారణీకరణకు దోహదపడిన అబ్రహం ఒప్పందాలను ప్రస్తావించారు. బందీల విడుదల, రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, ఇరాన్‌ను ఎదుర్కోవడం, గాజా పునర్నిర్మాణానికి సంబంధించిన చర్యలను కూడా తన శాంతి ప్రయత్నాలుగా పేర్కొన్నారు. ప్రపంచం అసాధ్యమని భావించిన అబ్రహం ఒప్పందాలను తాను సాధించానని, ఇప్పుడు వాటిని మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌కు సంబంధించిన పరిణామాలను ఎదుర్కోవడంతో పాటు ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు కూడా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

నోబెల్ శాంతి బహుమతి తనకు దక్కకపోవడంపై ట్రంప్ గతంలోనూ పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించడంలో తన పాత్రను ప్రస్తావిస్తూ.. తనకు ఈ పురస్కారం రావాల్సిందని వాదించారు. 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడంపైనా ట్రంప్ గతంలో విమర్శలు చేశారు. తాజాగా నవీ పిళ్లేకు పురస్కారం ఇవ్వడాన్ని తప్పుబట్టడం ద్వారా నోబెల్ కమిటీ ఎంపికలపై మరోసారి ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.