Modi-Trump: బెంగాల్‌లో విజయంపై మోడీని అభినందించిన ట్రంప్

  • బెంగాల్‌లో బీజేపీ విజయంపై స్పందించిన ట్రంప్
  • ప్రధాని మోడీని అభినందించిన ట్రంప్
  • చారిత్రాత్మక, నిర్ణయాత్మక ఎన్నికల విజయంగా అభివర్ణన
Trump

Trump

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఘన విజయం సాధించడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. బెంగాల్ విజయంపై ప్రధాని మోడీకి ట్రంప్ అభినందనలు తెలిపారు. ‘‘చారిత్రాత్మక, నిర్ణయాత్మక ఎన్నికల విజయం.’’గా వైట్‌హౌస్ అభివర్ణించింది. ఈ విజయంపై మోడీకి ట్రంప్ అభినందనలు తెలిపినట్లుగా పేర్కొంది.

వైట్ హౌస్ ప్రతినిధి కుష్ దేశాయ్ మాట్లాడుతూ.. ఇటీవల ట్రంప్-మోడీ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో భారతదేశానికి మోడీ వంటి నాయకుడు ఉండటం అదృష్టమని ట్రంప్ పేర్కొన్నారని తెలిపారు. తాజా ఎన్నికల విజయంపై కూడా ట్రంప్ ప్రత్యేకంగా మోడీకి అభినందనలు తెలియజేశారని చెప్పారు.

పశ్చిమ బెంగాల్‌లో 294 స్థానాలకు గాను 207 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. తృణమూల్ కాంగ్రెస్‌ను అధికారంలో నుంచి దించింది. మమత నేతృత్వంలోని టీఎంసీకి ఇది పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పుకు నాంది పలికాయి. ఇక అస్సాంలో కూడా బీజేపీ వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. పుదుచ్చేరిలో కూడా బీజేపీ బలమైన మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించింది. ఇక కేరళలో మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (UDF) స్పష్టమైన మెజార్టీతో 140 స్థానాల్లో 100 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (LDF) కేవలం 35 సీట్లకే పరిమితమైంది. ఇక తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) సంచలన విజయం సాధించింది. 234 స్థానాల్లో టీవీకే 108 సీట్లు గెలుచుకుంది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 8 రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ ప్రభుత్వాలు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 18 రాష్ట్రాలకు చేరింది.