Trump: పాపం ట్రంప్.. చైనాలో అమెరికా అధ్యక్షుడికి అవమానం!

Trump

Trump

Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం చైనాకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అగ్రరాజ్యాధినేత బీజింగ్ విమానాశ్రయంలో అడుగు పెట్టిన సమయంలో ఆయనకు స్వాగతం పలకడానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్వయంగా రాలేదు. ట్రంప్‌కు స్వాగతం పలకడానికి జిన్‌పింగ్.. ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌ను పంపారు. చైనా వార్తా సంస్థ జిన్హువా ప్రకారం.. బీజింగ్‌లో చైనా ఉపాధ్యక్షుడు ట్రంప్‌కు స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఉపాధ్యక్షుడు జెంగ్‌తో పాటు బీజింగ్‌లోని అమెరికా రాయబారి డేవిడ్ పెర్డ్యూ, అమెరికాలోని చైనా రాయబారి షీ ఫెంగ్, చైనా తాత్కాలిక విదేశాంగ శాఖ ఉప మంత్రి మా జావోక్సు ఉన్నారు.

ట్రంప్‌కు స్వాగతం పలకడానికి అధికారులతో పాటు 300 మంది యువకులు వచ్చారు. ఈ క్రమంలో స్వాగత ఏర్పాట్లలో భాగంగా విమానాశ్రయంలో ఒక బ్యాండ్‌ను కూడా ఏర్పాటు చేశారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ యూఏఈ, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాలను సందర్శించారు. ఆ సమయంలో ఆయనకు స్వాగతం పలకడానికి ఆ దేశాధినేతలు స్వయంగా విమానాశ్రయానికి వచ్చారు. అయితే తాజగా చైనా పర్యటనకు వచ్చిన ట్రంప్‌కు స్వాగతం పలకడానికి జిన్‌పింగ్ రాకుండా ఉపాధ్యక్షుడిని పంపించడం అవమానమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

షీ జిన్‌పింగ్ ఎందుకు వెళ్లలేదంటే..
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. ప్రోటోకాల్ ప్రకారం విదేశాంగ మంత్రి విమానాశ్రయంలో అధ్యక్షుడికి స్వాగతం పలకాలి. 2017లో ట్రంప్ బీజింగ్‌ను సందర్శించినప్పుడు, ఆయనతో పాటు ఒక స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారి కూడా వెళ్లారు, కానీ ఈసారి ట్రంప్‌ను శాంతింపజేయడానికి షీ జిన్‌పింగ్ ఉపాధ్యక్షుడిని పంపారు. నిజానికి చైనా అధ్యక్షుడు విమానాశ్రయంలో ఏ నాయకుడికీ వ్యక్తిగతంగా స్వాగతం పలకరని సమాచారం. ట్రంప్‌ కంటే ముందు, పుతిన్ – కిమ్ జోంగ్ ఉన్ చైనాను సందర్శించారు. ఆ టైంలో కూడా షీ జిన్‌పింగ్ వారికి విమానాశ్రయంలో వ్యక్తిగతంగా స్వాగతం పలకలేదు. అయితే 2009లో చివరిసారిగా విమానాశ్రయంలో షీ జిన్‌పింగ్ ఒక అమెరికా అధ్యక్షుడికి స్వాగతం పలుకుతూ కనిపించారు. ఆ సమయంలో జిన్‌పింగ్ చైనా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అప్పుడు చైనా పర్యటనకు వచ్చిన ఒబామాకు ఆయన స్వాగతం పలకడానికి విమానాశ్రయానికి వెళ్లారు.

రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ తాజాగా చైనాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ట్రంప్ చైనాతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అరుదైన ఖనిజాల విషయమై చర్చలు జరపనున్నారు. ఆయన చైనా అధ్యక్షుడితో సుంకాల గురించి కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం. చైనా, తైవాన్‌ల మధ్య ఇటీవల వివాదాలు తీవ్రతరం అయిన నేపథ్యంలో కూడా ఈ పర్యటనకు ప్రాముఖ్యత ఉంది. తైవాన్‌ను అమెరికా మిత్రదేశంగా పరిగణిస్తుంది. 2027 నాటికి చైనా తైవాన్‌పై దాడి చేయవచ్చని అమెరికా అధికారులు భావిస్తున్నారు. అందువల్ల ట్రంప్ పర్యటన తైవాన్ విషయంలో చైనా వైఖరిని స్పష్టం చేస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా అమెరికా ప్రస్తుతం ఇరాన్ యుద్ధంలో తీవ్రంగా చిక్కుకుంది. ట్రంప్ ఈ సంఘర్షణ నుంచి బయటపడే మార్గం కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో చైనాను ఇరాన్‌కు సన్నిహిత మిత్రదేశంగా పరిగణిస్తారు. ట్రంప్ చైనా అధ్యక్షుడితో కూడా ఇరాన్ యుద్ధం గురించి చర్చించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, కొంతమంది అమెరికన్ పారిశ్రామికవేత్తలు ఉన్నారు.