Trump Assassination Threat: ట్రంప్ హత్యకు కుట్ర?.. మూడు తుపాకులతో వైట్‌హౌస్ వద్ద వెనిజులా వ్యక్తి పట్టివేత

Trump

Trump

Trump Assassination Threat: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయాలని తన మెదడులో స్వరాలు వినిపిస్తున్నాయని చెప్పిన ఓ వెనిజులా వ్యక్తిని అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు అరెస్ట్ చేశారు. వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ కారులో మూడు తుపాకులు, భారీగా బుల్లెట్లు లభించడంతో అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అమెరికాలో కలకలం రేపింది.

అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి వైట్‌హౌస్ సమీపంలో పార్క్ చేసి ఉన్న ఓ కారులో అనుమానాస్పదంగా కూర్చున్న వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ అధికారులు గుర్తించారు. అతడి ప్రవర్తనపై అనుమానం రావడంతో అధికారులు కారును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కారులో మూడు వేర్వేరు తుపాకులు, డజన్ల కొద్దీ బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా, ఆ వాహనం దొంగిలించబడినట్లు గతంలో ఫిర్యాదు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

అధికారుల వివరాల ప్రకారం.. అరెస్టయిన వ్యక్తిని రోనీ యోర్డ్రిక్స్ గువానిపా చిరినోస్ (Ronny Yordrix Guanipa Chirinos)గా గుర్తించారు. తన మెదడులో కొన్ని స్వరాలు వినిపిస్తున్నాయని, అవి అమెరికా రాజధాని వాషింగ్టన్‌కు వెళ్లి రిపబ్లికన్ పార్టీకి చెందిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయాలని చెబుతున్నాయని అతడు అధికారులకు తెలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకారం.. నిందితుడు వెనిజులాకు చెందిన వలసదారుడు. అతడు మార్చి 2024లో టెక్సాస్ మార్గం ద్వారా అమెరికాలోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో అతడిపై అభియోగాలు నమోదు చేసినట్లు, ప్రస్తుతం యూఎస్ మార్షల్స్ సర్వీస్ కస్టడీలో ఉన్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది.

ఈ ఘటనపై అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ మార్క్‌వేన్ ముల్లిన్ స్పందించారు. సీక్రెట్ సర్వీస్ అధికారుల అప్రమత్తత వల్లే వైట్‌హౌస్ సమీపంలో మూడు ఆయుధాలతో ఉన్న వ్యక్తిని సకాలంలో అరెస్ట్ చేయగలిగామని తెలిపారు. అతడు ఎవరికైనా హాని కలిగించేలోపే అధికారులు పట్టుకున్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, గతంలోనూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు బెదిరింపులు వచ్చిన ఘటనలపై అమెరికా భద్రతా సంస్థలు చర్యలు తీసుకున్నాయి. తాజా అరెస్ట్‌తో వైట్‌హౌస్ భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారింది.