NTV Telugu Site icon

WHO డ్యాష్ బోర్డులో కాశ్మీర్ పై వివాదం.. మోడీకి టీఎంసీ ఎంపీ లేఖ

ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ 19 డ్యాష్ బోర్డులో ప్రస్తావించిన అంశం ఒకటి వివాదానికి ఆజ్యం పోస్తోంది. జమ్మూకాశ్మీర్ ని డబ్ల్యుహెచ్ వో డ్యాష్ బోర్డులో చైనా పాకిస్తాన్ లోని భాగంగా ప్రపంచ మ్యాప్ లో చూపించడం ఈ వివాదానికి కారణం అయింది. భారత్ లో అంతర్భాగమయిన కాశ్మీర్ ని ప్రపంచ ఆరోగ్యసంస్థ అలా చూపించడంపై టీఎంసీ ఎంపీ డా.శంతాను సేన్ తీవ్రంగా స్పందించారు. దీనిపై ప్రధాని మోడీకి ఆయన లేఖ రాశారు. ఈ మ్యాప్ లో కాశ్మీర్ భాగానికి సంబంధించిన కలర్ కూడా మార్చేశారు. ఈ రంగు పాకిస్తాన్, చైనా రంగులతో కలిపేశారు.

ప్రపంచ ఆరోగ్యసంస్థ డ్యాష్ బోర్డులో ఆయా దేశాల్లో కోవిడ్ పరిస్థితులకు సంబంధించిన డేటా వుంచింది. కానీ బ్లూ రంగులో వున్న ప్రాంతాన్ని క్లిక్ చేస్తే మాత్రం కాశ్మీర్ లోని ప్రధాన భాగం చైనాలోనూ, కొంత భాగం పాకిస్తాన్ లోనూ కనిపించడం విస్మయానికి గురిచేసిందన్నారు ఎంపీ శంతాను సేన్. దీనిపై వెంటనే స్పందించాలని ప్రధాని మోడీకి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్ విషయంలోనూ అదే జరుగుతోందన్నారు. దేశ సార్బభౌమత్వానికి సంబంధించిన అంశమని, అంతర్జాతీయంగా దీనిని ప్రస్తావించాలన్నారు టీఎంసీ ఎంపీ. గతంలో ట్విట్టర్ కూడా లేహ్ ప్రాంతాన్ని జీయో ట్యాగింగ్ లో రిపబ్లిక్ ఆఫ్ చైనాలో భాగంగా చూపించిందన్నారు.