Nepal Floods: నేపాల్‌లకు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!

  • టిబెట్-నేపాల్ సరిహద్దులో మరో ప్రమాదాన్ని గుర్తించిన చైనా.
  • బారియర్ సరస్సు 72 గంటల్లో బద్ధలయ్యే అవకాశం.
  • సరస్సులో ప్రస్తుతం 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు.
  • మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరే అవకాశం.
Nepal Floods (2)

Nepal Floods (2)

Nepal Floods: నేపాల్‌లో భోటేకోసి నది ఉప్పెనలా విరుచుకుపడింది. హిమాలయాల్లో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపోవడం, గ్లేసియర్ సరస్సు బద్ధలవ్వడంతో ఒక్కసారిగా మెరుపు వరదలు సంభవించాయి. ఈ ప్రమాదంలో నేపాల్-టిబెట్ సరిహద్దుల్లోని రాసువా జిల్లా అతలాకుతలమైంది. వందలాది ఊర్లు నీటి ప్రళయానికి కొట్టుకుపోయాయి. వందలాది మంది గల్లంతయ్యారు. టిబెల్‌లో కూడా ఈ వరదలు ప్రభావాన్ని చూపాయి.

ఇదిలా ఉంటే, టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో మరో ప్రమాదం పొంచి ఉన్నట్లు చైనా హెచ్చరించింది. హిమాలయ సరిహద్దు ప్రాంతానికి ఎగువన ఏర్పడిన బారియర్ సరస్సు రాబోయే 72 గంటల్లో బద్ధలయ్యే అవకాశం ఉందని చైనా ప్రభుత్వ మీడియా సీసీటీవీ వెల్లడించింది. విపత్తు జరిగిన ప్రాంతానికి ఈశాన్యంగా చొచెన్ ఖోలా, పురేపు త్సాంగ్సో నదులు కలిసే ప్రాంతంలో ఈ సరస్సు ఉన్నట్లు తెలిపింది. గురువారం నాటికి సరస్సులో సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు ఉన్నట్లు అంచనా. ఇప్పటికే సరస్సు పొంగిపొర్లుతోంది. వచ్చే మూడు రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు సరస్సులోకి చేరే అవకాశం ఉందని చైనా సెంట్రల్ టెలివిజన్ తెలిపింది.

టిబెట్‌లోని గైరాంగ్ సమీపంలో మట్టి, రాళ్ల గోడ లెండే నదిలోకి కూలిపోవడంతో భారీగా నీరు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు ప్రవహించింది. దీంతో భోటే కోసి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు, పట్టణాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఈ విపత్తులో ఇప్పటి వరకు 1500 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. నేపాల్, టిబెల్ కలుపుకుని 332 మంది ఇప్పటి వరకు మరణించారు. గల్లంతైన వారిలో 288 మంది భారతీయులు ఉన్నారు. మరోవైపు నేపాల్ వైపు దాదాపు 100 మంది చైనా పౌరులు గల్లంతైనట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ తెలిపారు.