Site icon NTV Telugu

Russia – Ukraine War: రష్యాకు భారీ షాక్.. వేలమంది వెనక్కి

Russia Military Mobilizatio

Russia Military Mobilizatio

Thousands Of Mobilized Men In Russian Region Sent Home: ఉక్రెయిన్‌పై దాడుల్ని మరింత ఉధృతం చేసేందుకు.. రష్యా ఇటీవల సైనిక సమీకరణ చేపట్టింది. సుమారు 3 లక్షల మంది సైన్యాన్ని సమీకరించేందుకు సిద్ధమైంది. అయితే.. ఈ సైనిక సమీకరణ రష్యాకు లేనిపోని తిప్పలు తెచ్చిపెట్టింది. అధ్యక్షుడు పుతిన్ ఈ సైనిక సమీకరణ ప్రకటన చేయడమే ఆలస్యం.. దీన్నుంచి తప్పించుకోవడం కోసం వేలాది మంది జనాలు రష్యాను వీడుతున్నారు. మునుపెన్నడూ లేనంతగా.. ఎయిర్‌పోర్టులో ప్రయాణికులతో నిండిపోతున్నాయి. అటు.. అర్హుల ఎంపిక కూడా చాలా కష్టమవుతోంది. ఇది చాలదన్నట్టు.. తాజాగా ఖబరోవ్స్క్‌ ప్రాంతం నుంచి సైన్యంలో చేరేందుకు వచ్చిన వేలాది మందిని అధికారులు వెనక్కు పంపారు. ఇందుకు కారణం.. ఆర్మీ ప్రమాణాలను వాళ్లు ఏమాత్రం అందుకోకపోవడమే! ఈ క్రమంలోనే స్థానిక మిలిటరీ కమిషనర్‌ను తొలగించేశారు.

‘‘ఖబరోవ్స్క్ మిలిటరీ కమిషనర్ యూరి లైకోని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే.. సైనిక సమీకరణ ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రక్రియపై ఆయన సస్పెన్షన్ ఏమాత్రం ప్రభావం చూపదు’’ అంటూ గవర్నర్‌ మిఖాయిల్ డెగ్తియారోవ్ వెల్లడించారు. కమిషనర్‌ను ఇలా సడెన్‌గా తీసెయ్యడానికి గల కారణాలను రివీల్ చేయలేదు కానీ, రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో చాలా తప్పిదాలు జరుగుతున్నాయని ఆయన ప్రస్తావించారు. గత 10 రోజుల వ్యవధిలో ఖబరోవ్స్క్ రీజన్ నుంచి వేలాది సంఖ్యలో జనాలు సైనిక నమోదు కార్యాలయాలకు వచ్చారని, కానీ వారిలో సగం మంది ఎంపిక ప్రమాణాల్ని అందుకోకపోవడంతో అధికారులు వారిని వెనక్కు పంపారని చెప్పారు. అధ్యక్షుడు, రక్షణశాఖ ఆమోదించిన వర్గాలను మాత్రమే ఎంపిక చేయాలని ఆయన స్పష్టం చేశారు. చూస్తుంటే.. ఈ వ్యవహారంలో తేడా కొట్టడం వల్లే, కమిషనర్‌పై చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇదిలావుండగా.. రష్యా ఇప్పటివరకూ ఉక్రెయిన్‌లోని చాలా ప్రాంతాల్ని ఆక్రమించింది. డోనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజ్జియా తదితర ప్రాంతాల్ని రష్యాలో విలీనం చేసినట్టు ఇటీవల పుతిన్ ఓ అధికార ప్రకటనలో తెలిపారు. ఈ నాలుగు ప్రాంతాలకు చెందిన 15 శాతం భూభాగం మాత్రమే ఉక్రెయిన్‌లో ఉంది. ఏడు నెలల నుంచి జరుగుతున్న యుద్ధంలో.. ఉక్రెయిన్‌కు చెందిన తూర్పు భాగాల్ని రష్యా పాక్షికంగా ఆక్రమించింది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత, ఆ నాలుగు ప్రాంతాల్ని రష్యాలో అధికారికంగా విలీనం చేసుకుంది.

Exit mobile version