Israel-Hamas War: అక్టోబర్ 07 నాటి దాడుల తర్వాత నుంచి ఇజ్రాయిల్ పాలస్తీనాపై విరుచుకుపడుతోంది. ముఖ్యంగా గాజా స్ట్రిప్‌లో హమాస్‌ను తుడిచిపెట్టేందుకు విస్తృత దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటికే హమాస్ అగ్రనాయకత్వాన్ని ఇజ్రాయిల్ అంతం చేసింది. కానీ, మరికొంత మంది ఇజ్రాయిలీ బందీలు ఇంకా హమాస్ చెరలోనే ఉన్నారు. ఇటీవల, గాజాలో శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు గాజా పీస్ ప్లాన్ ప్రకటించారు. అయితే, మరోవైపు గాజా సిటీని వదిలి వెళ్లాలని ఇజ్రాయిల్ బుధవారం తుది హెచ్చరికలు జారీ చేసింది.
Read Also: Eknath Shinde: ఉద్ధవ్ ఠాక్రే పాకిస్తాన్‌లో దసరా నిర్వహించి, ఆసిమ్ మునీర్‌ని ఆహ్వానించాలి..
గాజా నగరంపై ఇజ్రాయిల్ భారీ దాడులు చేస్తోంది. గాజా నగరాన్ని చుట్టుముట్టినట్లు ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కాట్జ్ అన్నారు. గాజా స్ట్రిప్ దక్షిణ భాగంలోకి ప్రజలు వెళ్లాలని, ఇది హమాస్ ఉగ్రవాదుల నుంచి వారిని వేరు చేస్తుందని కాట్జ్ ఎక్స్‌లో చెప్పారు. ఒకవేళ ఎవరైనా గాజా సిటీలో మిగిలి ఉంటే వారిని ఉగ్రవాదులుగా పరిగణిస్తామని హెచ్చరించారు. సైన్యం ఇప్పటికే నెట్‌జారిమ్ కారిడార్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కాట్జ్ చెప్పారు. ఇప్పుడు గాజా నగరాన్ని వదిలి వెళ్లే వారు ఇజ్రాయిల్ సైనిక పోస్టుల గుండా వెళ్లాల్సి వస్తుందని ఆయన చెప్పారు.
ఇజ్రాయిల్ దాడులు తీవ్రం కావడంతో రెడ్ క్రాస్ గాజా నగరంలో కార్యకలాపాలను నిలిపేసినట్లు తెలిపింది. ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికను హమాస్ పరిశీలిస్తోంది. నిరాయుధీకరణను హమాస్ ఒప్పుకోవడం లేదు. బుధవారం ఇజ్రాయిల జరిపిన దాడుల్లో 46 మంది మరణించారు. ఇజ్రాయిల్ జరుపుతున్న దాడుల్లో ఇప్పటి వరకు 66 వేలకు పైగా పాలస్తీనియన్ల మరణించినట్లు హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది.
