Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!

Texasshooting

Texasshooting

Texas Shooting: టెక్సాస్‌లోని అమరిల్లో నగరంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో వెస్ట్‌మిన్‌స్టర్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఒక వేడుక రక్తసిక్తమైంది. అపార్ట్‌మెంట్‌లో పార్టీ జరుగుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు లోపలికి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ హింసాత్మక ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానిక నివేదికల ప్రకారం.. డజన్ల కొద్దీ కాల్పులు జరగడంతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండగులు వాడిన ఆయుధాల శబ్దం “మెషిన్ గన్ కాల్పుల”ను తలపించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు విడిచారు. మరికొంతమంది బాధితుల పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కాల్పులకు ముందు మరో చోట జరిగిన చిన్నపాటి ఘర్షణే ఈ దారుణానికి దారితీసినట్లు తెలుస్తోంది. వేరే పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టిన కొందరు మైనర్లు, యువకులు.. కక్షగట్టి అపార్ట్‌మెంట్ వరకు బాధితులను వెంబడించారు. అక్కడ బలవంతంగా లోపలికి ప్రవేశించి తుపాకులతో విరుచుకుపడ్డారని సమాచారం.

అమరిల్లో నగరంలో ఇటీవలి కాలంలో తుపాకీ హింస విపరీతంగా పెరిగిపోతోంది. కేవలం కొద్ది వారాల వ్యవధిలోనే నగరంలో పలు కాల్పుల ఘటనలు జరగడం స్థానికులను బెంబేలెత్తిస్తోంది. నేరాల పెరుగుదల, తుపాకుల లభ్యతపై పౌర సమాజం నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.