Site icon NTV Telugu

Afghanistan: బురఖా ధరించని విద్యార్థినులపై తాలిబాన్ అధికారుల దాడులు.. వీడియో వైరల్

Afghanistan

Afghanistan

Taliban Official Beating Female Students Outside Afghan University: ఆఫ్ఘనిస్తాన్ లో మహిళల హక్కులు ఏ విధంగా ఉంటాయో.. మహిళలను తాలిబాన్లు ఎంత చిన్నచూసు చూస్తారనే దానికి చిన్న ఉదాహరణ ఈ వీడియో. తమ హక్కుల గురించి పోరాడితే అక్కడి తాలిబాన్ ప్రభుత్వం మహిళలను అణచివేస్తోంది. నిరసన తెలుపుతున్న మహిళా విద్యార్థులపై తాలిబాన్ అధికారులు దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూనివర్సిటీ ముందు నిరసన తెలుపుతున్న విద్యార్థినులను తాలిబాన్ అధికారి కొట్టడం ఈ వీడియోలో కనిపిస్తుంది.

బురఖా ధరించనందుకు యూనివర్సిటీలోకి ప్రవేశాన్ని నిరాకరించడంతో, మహిళలు గేటు మందు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో తాలిబాన్ అధికారి కొరడాతో వారిపై దాడి చేశారు. విద్యార్థినులపై దాడి చేస్తున్న అధికారి, తాలిబాన్ మతవ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన వారిగా గుర్తించారు. ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్ లోని బదక్షన్ విశ్వవిద్యాలయంలో ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. తమను లోపలికి అనుమతించాలని.. విద్యాహక్కు గురించి నిరసన తెలుపుతున్న మహిళలపై దాడి చేశారు అధికారులు. అయితే వీరందరు ముఖం కప్పుకునేలా బురఖా ధరించకపోవడంతో అధికారులు యూనివర్సిటీలోకి అనుమతించలేదు.

Read Also: North Korea: ఏకంగా 10 క్షిపణుల ప్రయోగం.. సౌత్ కొరియా హై అలెర్ట్..

గతేడాది ఆగస్టులో ప్రజాప్రభుత్వం నుంచి అధికారం చేపట్టారు తాలిబాన్లు. అప్పటి నుంచి అక్కడి మహిళలకు స్వతంత్య్రం లేకుండా పోయింది. ఉద్యోగాలు చేసేందుకు, చదువుకునేందుకు మహిళలకు అనుమతి నిరాకరిస్తున్నారు తాలిబాన్ అధికారులు. మహిళల స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ, వస్త్రధారణపై తీవ్ర ఆంక్షలు విధించారు. ఆరో తరగతి నుంచి బాలికలను పాఠశాలకు రానీయకుండా నిషేధించారు. హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రకారం.. తాలిబాన్ల పాలన క్రూరంగా ఉందని.. నిరసన తెలిపితే కొట్టడం, ప్రదర్శనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులను నిర్భంధించడం, హింసించడం చేస్తోందని వెల్లడించింది. అనధికార నిరసనలను తాలిబాన్లు నిషేధించారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ టాప్ లో ఉంది.

Exit mobile version