Site icon NTV Telugu

Afghan-Pak War: ఆఫ్ఘాన్-పాక్ యుద్ధం.. ట్రెండింగ్‌లో ‘‘93,000’’.. భారత్‌తో సంబంధం..

Afghan Pak War

Afghan Pak War

Afghan-Pak War: పాకిస్తాన్‌కు ఆఫ్ఘానిస్తాన్ చుక్కలు చూపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. తాలిబాన్ దళాలు, పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తోంది. డ్యూరాండ్ రేఖ వద్ద ఆఫ్ఘాన్ దళాలు పాక్ సైన్యానికి చెందిన పలు పోస్టుల్ని స్వాధీనం చేసుకున్నాయి. పలువురు పాక్ సైనికుల్ని నిర్భందించి, కాబూల్‌కు తరలించింది. అంతే కాకుండా పాక్ సైన్యానికి చెందిన ట్యాంకుల్ని కాబూల్ తీసుకెళ్లి, ఊరేగించడం వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే, ఆఫ్ఘాన్ పాక్ ఉద్రిక్తతల మధ్య ‘‘93000’’ అనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నెటిజన్లు పాకిస్తాన్, దాని ఆర్మీపై తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. 1971 బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో భారత్, పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్‌కు చెందిన 93,000 మంది సైనికులు భారత్ ముందు లొంగిపోయారు. ఇప్పుడు, ఆఫ్ఘాన్ కూడా పాకిస్తాన్‌ను దారుణంగా దెబ్బ కొడుతోంది. ఈ నేపథ్యంలో, ఆనాటి భారత విజయాన్ని గుర్తు చేస్తూ ఆఫ్ఘాన్‌కు మద్దతుగా ‘‘93000’’ ట్రెండ్ అవుతోంది.

Read Also: Siddaramaiah: ఇన్ఫోసిస్ వల్లే ఆయనకు అన్నీ తెలుసా..? నారాయణ మూర్తిపై కర్ణాటక సీఎం విమర్శలు

ఆఫ్ఘానిస్తాన్ కు చెందిన ఓ నెటిజన్.. ‘‘1971లో భారత్ ముందు లొంగారు. 2025లో ఆఫ్ఘానిస్తాన్ ముందు లొంగారు. టీం 93,000గా ఇంకా మారలేదు’’ అని ట్వీట్ చేశారు. మరొకరు ‘‘ప్యాంట్లు పారేసి పారిపోయే విధానం మాత్రం పాకిస్తాన్ సైన్యంలో అసలైన సంప్రదాయం’’ అని ఎగతాళి చేశారు.

ఆఫ్ఘానిస్తాన్ కు చెందిన చాలా మంది దీనిని ‘‘93,000 ప్యాంటు వేడుక 2.0’’ అని పిలుస్తున్నారు. డిసెంబర్ 1971లో పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ అమీర్ అబ్దుల్లా నియాజీ భారత్ లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా ముందు లొంగుబాటు పత్రాలపై సంతకం చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆఫ్ఘాన్ నెటిజన్లు ‘‘ఈ రోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఒకరోజు ఆఫ్ఘాన్ భారత దేశ 93,000 రికార్డును బద్ధలు కొడుతుంది’’ అని పాకిస్తాన్‌ను వెక్కిరిస్తున్నారు.

Exit mobile version